25.5 C
Hyderabad

ఇందూర్ మదర్ హుడ్ హాస్పిటల్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలి

Action must be taken against the management of Indur Motherhood Hospital.

Must read

📰 Generate e-Paper Clip

 

. . . ప్రజావాణిలో ఆర్‌ఎస్‌పీ జిల్లా కమిటీ ఫిర్యాదు

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :

 

ఇందూర్ మదర్ హుడ్ హాస్పిటల్ యాజమాన్యంపై తక్షణ చర్యలు తీసుకోవాలని కోరుతూ రెవల్యూషనరీ సోషలిస్ట్ పార్టీ (ఆర్ఎస్ పీ) నిజామాబాద్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సోమవారం ప్రజావాణిలో వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఆర్‌ఎస్‌పీ జిల్లా కార్యదర్శి కటారి రాములు మాట్లాడుతూ ఒక గర్భిణీ మహిళను ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లాల్సిన సమయంలో ప్రైవేట్ అంబులెన్స్ డ్రైవర్, ఇందూర్ మదర్ హుడ్ హాస్పిటల్ యాజమాన్యంతో కుమ్మక్కై ప్రభుత్వ ఆసుపత్రిలో డాక్టర్ లేరని తప్పుడు సమాచారం ఇచ్చి ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారని ఆరోపించారు. కేవలం రూ.25 వేలలోనే ప్రసవం పూర్తి చేస్తామని చెప్పి చివరకు రూ.85 వేల వరకు బిల్లు వసూలు చేశారని తెలిపారు. ఈ విషయమై బాధిత కుటుంబం జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి కార్యాలయంలో ఫిర్యాదు చేసిన అనంతరం హాస్పిటల్ యాజమాన్యం తరఫున ముగ్గురు వ్యక్తులు బాధిత మహిళ ఇంటికి వెళ్లి తెల్ల కాగితంపై సంతకం చేయాలని ఒత్తిడి తీసుకువచ్చి, బెదిరింపులకు పాల్పడ్డారని పేర్కొన్నారు. బాధితులను భయభ్రాంతులకు గురిచేయడం అత్యంత దారుణమన్నారు. ఇలాంటి చర్యలకు పాల్పడిన హాస్పిటల్ యాజమాన్యంపై చట్టపరమైన చర్యలు తీసుకునిబాధిత మహిళకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో బాధిత కుటుంబంతో కలిసి హాస్పిటల్ ఎదుట బైఠాయించి ఆందోళన చేపడతామని హెచ్చరించారు. అలాగే ఈ విషయంపై డీఎంహెచ్‌ఓ కార్యాలయానికి ఫిర్యాదు చేసి వారం రోజులు గడిచినా ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం విచారకరమని, సంబంధిత అధికారులు వెంటనే విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మహమ్మద్ నిజాముద్దీన్, సునీల్, రంజిత్, రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article