24.1 C
Hyderabad
Monday, August 3, 2026

వ్యర్థాలను డిస్పోస్ చేయని ఆసుపత్రులపై చర్యలు

Must read

📰 Generate e-Paper Clip

  •  కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి

 

నిజామాబాద్, బతుకమ్మ : ఆసుపత్రుల వ్యర్థాలను నిబంధనలకు అనుగుణంగా సరైన విధానంలో  డిస్పోస్ చేయని హాస్పిటల్స్ పై చర్యలు తీసుకోవాలని కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి అధికారులను ఆదేశించారు. జక్రాన్ పల్లి మండలం పడకల్ గ్రామ శివారులో శ్రీ మెడికేర్ సర్వీసెస్ ఏజెన్సీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మెడికల్ వేస్టేజీని నిర్వీర్యం చేసే ప్లాంట్ ను కలెక్టర్ శుక్రవారం సందర్శించారు. ప్రతి రోజు ఎన్ని ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రుల నుండి వ్యర్ధాలను సేకరిస్తున్నారు, వాటిని ఎలా నిర్వీర్యం చేస్తున్నారు అని వివరాలు అడిగి తెలుసుకుని రికార్డులను తనిఖీ చేశారు. జిల్లాలో 900 వరకు ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రులు కొనసాగుతుండగా, సగానికి పైగా ఆసుపత్రుల నుండి వ్యర్ధాలను సేకరించడం లేదని కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆసుపత్రుల వ్యర్ధాలను హాస్పిటల్స్ నుండి ఏజెన్సీ వారు ప్రతిరోజూ సేకరిస్తూ ఈ ప్లాంట్ లో నిర్వీర్యం చేయాల్సి ఉండగా, ఈ ప్రక్రియ పూర్తి స్థాయిలో ఎందుకు నిర్వహించడం లేదని నిలదీశారు. మెడికల్ వేస్టేజీని పక్కాగా సేకరించని కారణంగా ప్రైవేట్ ఆసుపత్రులకు చెందిన అనేక మంది వ్యర్ధాలను ఎక్కడబడితే అక్కడ పారవేస్తున్నారని, ఇది ప్రజల ఆరోగ్యాలకు ప్రమాదకరంగా పరిణమిస్తుందని కలెక్టర్ ఆందోళన వ్యక్తం చేశారు. కాంట్రాక్ట్ ఏజెన్సీకి వ్యర్థాలు అందించని ఆసుపత్రులకు నోటీసులు జారీ చేయాలని, అయినప్పటికీ మెడికల్ వేస్టేజీ విషయంలో నిబంధనలు అమలు చేయకపోతే అలాంటి ఆసుపత్రుల అనుమతులను రద్దు చేయాలని కలెక్టర్ డీఎంహెచ్ఓ డాక్టర్ రాజశ్రీని ఆదేశించారు. అదేవిధంగా ఒప్పంద సేవలు కలిగి ఉన్న జిల్లాలోని అన్ని ఆసుపత్రుల నుండి వ్యర్ధాలను కాంట్రాక్ట్ ఏజెన్సీ ప్రతిరోజు సేకరించేలా పకడ్బందీ పర్యవేక్షణ చేయాలని, ఒకవేళ వ్యర్థాల సేకరణలో నిర్లక్ష్యంగా వ్యవరిస్తే ఏజెన్సీని రద్దు చేస్తామని కలెక్టర్ స్పష్టం చేశారు. వ్యర్ధాలను నిర్వీర్యం చేసే పనులలో పాల్గొంటున్న సిబ్బంది ఆరోగ్య పరిరక్షణ విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని, వారు అనారోగ్యాల బారిన పడకుండా తగిన టీకాలు ఇప్పించాలని ఏజెన్సీ నిర్వాహకులకు సూచించారు. ఏజెన్సీ పనితీరును క్రమం తప్పకుండా పర్యవేక్షణ జరపాలని కాలుష్య నియంత్రణ మండలి ఏ.ఈ మానసను ఆదేశించారు.

Action against hospitals that do not dispose of waste

  • సెంట్రల్ డ్రగ్స్ స్టోర్ తనిఖీ చేసిన కలెక్టర్..

నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని గంగాస్తాన్ ఫేజ్-1 లో గల సెంట్రల్ డ్రగ్స్ స్టోర్ (సి.డీ.ఎస్)ను కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. సి.డీ.ఎస్ లో రికార్డులలో పొందుపరచిన దానికి అనుగుణంగానే ఔషధ నిల్వలు అందుబాటులో ఉన్నాయా అని పరిశీలించారు. ఔషధాలను ఎక్కడి నుండి సమకూరుస్తారు, సి.డీ.ఎస్ ద్వారా వివిధ పీ.హెచ్.సిలకు వాటిని ఎలా చేరవేస్తారు తదితర వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఇండెంట్ వచ్చిన వెంటనే తాత్సారం చేయకుండా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు ఔషధాలు పంపించాలని, ప్రస్తుత వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు ప్రబలె ప్రమాదం ఉన్నందున అన్ని రకాల ఔషధాలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని ఫార్మసిస్ట్ గంగాధర్ ను ఆదేశించారు.

Action against hospitals that do not dispose of waste

More articles

Latest article