బతుకమ్మ బోధన్ :
నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం మంగళ్‌పహాడ్ గ్రామంలో పెళ్లి వేడుకకు సిద్ధమైన కుటుంబం కన్నీటి సముద్రంలో మునిగిపోయింది. గ్రామానికి చెందిన ప్రతాప్ గౌడ్ (31) మంగళవారం ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.గత రెండు రోజులుగా కనిపించకుండా ఉన్న ప్రతాప్ మృతదేహాన్ని మంగళవారం రాత్రి గ్రామ శివారులోని చెట్టుకు వేలాడుతూ స్థానికులు గుర్తించారు. ప్రతాప్ వివాహం గురువారం జరగాల్సి ఉండగా, ఈ ఘటనతో గ్రామం అంతా విషాద వాతావరణంలో మునిగిపోయింది. ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా స్పష్టంగా తెలియరాలేదు. కుటుంబ సభ్యులు తీవ్ర షాక్‌కు గురయ్యారు. ఎడపల్లి పోలీసులు కేసు నమోదు చేసి అన్ని కోణాల్లో దర్యాప్తు ప్రారంభించారు.మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం బోధన్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.గ్రామంలో ఒక్కసారిగా విషాదం నెలకొంది.
