27.1 C
Hyderabad
Saturday, August 1, 2026

అవగాహనకు రాకుండానే హడావుడి

Must read

📰 Generate e-Paper Clip

రైస్ మిల్లర్లతో ఒక అవగాహనకు రాకముందే ప్రభుత్వం హడావుడిగా ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభిస్తోంది. రైస్ మిల్లర్లు తమ షరతులను ప్రభుత్వం ముందుంచారు. దీనిపై ఒక క్లారిటీ రాకముందే ప్రభుత్వం హడావుడిగా కొనుగోలు కేంద్రాలను ప్రారంభిస్తోంది. జిల్లాలో మొత్తం 480 కొనుగోలు కేంద్రాలను తెరవాలని అధికారులు ప్రణాళిక సిద్ధం చేశారు. ఇప్పటికే 250 కొనుగోలు కేంద్రాలను ప్రజాప్రతినిధులు, అధికారులు కొబ్బరికాయలు కొట్టి ప్రారంభించారు. అయితే ఎక్కడా కూడా ధాన్యం సేకరించిన దాఖలాలు లేవు. రైతులు అడిగితే రేపుమాపు అంటూ కాలం వెళ్లదీస్తున్నారు. ప్రభుత్వం మద్దతుధర, బోనస్ ప్రకటించినా రైతులకు నమ్మకం లేక ప్రైవేట్ వ్యాపారులకు ధాన్యం విక్రయిస్తున్నారు.

 

. కొబ్బరికాయలు కొడుతూ ధాన్యం కొనుగోలు కేంద్రాల ప్రారంభం

. రైస్ మిల్లుల అలాట్ మెంట్ ను మరిచిన ప్రభుత్వం

. ప్రారంభమైన కేంద్రాల్లోనూ ధాన్యం గింజను సేకరించింది లేదు..

. నమ్మకం లేక ప్రైవేట్ వ్యాపారులకు విక్రయిస్తున్న రైతులు

నిజామాబాద్, బతుకమ్మ: వరి కోతలు జోరందుకున్న తరుణంలో ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియపై ఎక్కడా క్లారిటీ లేకుండా పోయింది. ఓ వైపు కొబ్బరికాయలు కొడుతూ హడావుడిగా కొనుగోలు కేంద్రాలను ప్రారంభిస్తున్న ప్రభుత్వం రైస్ మిల్లర్లకు అలాట్ మెంట్ అంశాన్ని మరిచింది. దీనికి కారణం రైస్ మిల్లర్లకు, ప్రభుత్వానికి మధ్య ఒక అవగాహన లేకపోవడమే. రైస్ మిల్లర్ల షరతులకు ఒప్పుకోని ప్రభుత్వం బోనస్, మద్దతు ధర ప్రకటించడంతోపాటు ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభిస్తుండడం చర్చనీయాంశమైంది.

రైస్ మిల్లర్ల ప్రతిపాదనలు

రైస్ మిల్లర్లకు ధాన్యం ఇస్తున్నప్రభుత్వం సీఎంఆర్(కస్లమ్ మిల్లింగ్ రైస్) విషయంలో కఠినంగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రైస్ మిల్లర్లు సైతం తమ ప్రతిపాదనలను ప్రభుత్వం ముందుంచారు. గతంలో క్వింటాల్ ధాన్యానికి 67 కిలోల సీఎంఆర్ ఇచ్చిన రైస్ మిల్లర్లు ఇప్పుడు తమతో 55 నుంచి 60 కిలోలకు మించి ఇవ్వడం కాదని తేల్చి చెబుతున్నారు. అలాగే మిల్లింగ్ చార్జీలను క్వింటాల్ కు రూ.30 ఇస్తున్నారని, అది సరిపోవడం లేదని రూ.70 చెల్లించాలంటున్నారు. పక్కనే ఉన్న ఆంధ్రప్రదేశ్ లో రూ.120 చెల్లిస్తున్నారని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. అలాగే ప్రభుత్వం  ఇచ్చే ధాన్యానికి తామేమీ గ్యారెంటీ ఇవ్వలేమని చేతులెత్తేశారు.

ప్రైవేట్ వ్యాపారుల జోరు

ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి ఒక నిర్దిష్టమైన ప్రక్రియ ప్రభుత్వం నుంచి కొరవడడంతో ప్రైవేట్ వ్యాపారులు తమ జోరు పెంచారు. ప్రభుత్వం క్వింటాల్ కు రూ.2,350 మద్దతు ధర, రూ.500 బోనస్ ప్రకటించింది.  ఈ లెక్కన ప్రభుత్వ  కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం  విక్రయిస్తే రైతుకు సుమారు రూ.2,800 ధర దక్కే అవకాశం ఉంది. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం విక్రయించాలనుకునే రైతు నిర్ణీత తేమశాతం వచ్చే వరకు ధాన్యాన్ని ఆరబోయాల్సి రావడం, కల్లాల్లో నుంచి ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల వద్దకు చేర్చడానికి హమాలీ, రవాణా ఖర్చులు భరించాల్సి ఉండడంతోపాటు అక్కడికి వెళ్లిన తరువాత తమ  వంతు వచ్చే వరకు పడిగాపులు కాయాల్సి ఉంటుంది. ఈ పరిస్థితులన్నింటిని ముందుగానే ఆలోచించిన రైతులు ప్రైవేట్ వ్యాపారులకు విక్రయించేందుకు మొగ్గు చూపుతున్నారు. వ్యాపారులు కల్లాల వద్దే పచ్చి ధాన్యాన్ని కొనుగోలు చేస్తూ క్వింటా ల్ కు రూ.2,300 నుంచి రూ.2,500 వరకు చెల్లిస్తున్నారు. ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర, బోనస్ తో పోలిస్తే తక్కువ ధర దక్కుతున్నప్పటికీ కల్లాల్లో నుంచే ధాన్యం వెళ్లిపోతోందని రైతులు ప్రైవేట్ వ్యాపారులకు విక్రయిస్తున్నారు.  ఖరీఫ్ సీజన్ ప్రారంభం నుంచి ఇప్పటి వరకు సుమారు 40 శాతం వరకు ధాన్యాన్ని ప్రైవేట్ వ్యాపారులు కొనుగోలు చేసినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు.

దిగుబడికి.. కొనుగోళ్లకు పొంతన లేదు

జిల్లాలో 13 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని అంచనా కాగా, ప్రభుత్వం 7లక్షల మెట్రిక్ టన్నులను సేకరించాలని నిర్ణయించింది. చివరి గింజ వరకూ సేకరిస్తామని ప్రకటించే ప్రభుత్వం ఇప్పటి వరకు సేకరణ ప్రారంభించకపోవడం కొసమెరుపు.

More articles

Latest article