. . . బాల్కొండలో అభ్యర్ధిత్వం రగడ
. . . ఇంచార్జీకి ఎసరు పెడుతున్న మాజీ డీసీసీ
. . . పెద్దాయన మద్దతు పై సర్వత్రా ఉత్కంఠ
. . . మాజీ డీసీసీ వ్యాఖ్యలపై దుమారం
నిజామాబాద్, బతుకమ్మ :
సాధారణ అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా రెండు సంవత్సరాల సమయం ఉంది. కానీ నిజామాబాద్ జిల్లాలో అప్పుడే అసెంబ్లీ బరిలో నేను ఉండబోతున్నానని మాజీ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు, తెలంగాణ రాష్ట్ర కోఆపరేటివ్ మాజీ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు జిల్లా రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. ఇటీవల తన సొంత గ్రామంలో దాదాపు 16 కోట్లతో చేపట్టిన అభివృద్ది పనులకు నిజామాబాద్ జిల్లాకు చెందిన కాంగ్రెస్ నేతలు అందరూ ఉండగానే గత ఎన్నికల్లో జస్ట్ మిస్సయ్యా.. రానున్న ఎన్నికల్లో బరిలో ఉంటా.. కార్తీక పౌర్ణమి నుంచి ప్రజల వద్దకు వెళ్తానంటూ ప్రకటన చేయడం కలకలం రేపింది. హస్తం పార్టీలో హాట్ టాఫిక్ గా మారింది. ఇప్పటికే ఉప్పు-నిప్పులా ఉన్న ఆరేంజ్ అధినేత సునీల్ కుమార్, మాజీ డీసీసీ చీఫ్ మానాల మోహన్ రెడ్డిల మధ్య తాజా ప్రకటన మరింత మంట పెట్టింది.
పీసీసీ చీప్ మహేష్ కుమార్ గౌడ్ సొంత నియోజకవర్గం బాల్కొండలో నేతల మధ్య ఆధిపత్య పోరు నడుస్తోంది. నియోజకవర్గ ఇంచార్జీ సునీల్ రెడ్డి, మాజీ డీసీసీ అధ్యక్షుడు మానాల మోహన్ రెడ్డిల మధ్య ఇప్పటికే వర్గపోరు తారాస్దాయికి చేరగా తాజాగా అభ్యర్ధిత్వం రగడ మొదలైంది. నియోజకవర్గాల పునర్విభజన జరిగి భీంగల్ సెగ్మెంట్ గా మారితే.. పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఇక్కడి నుంచి పోటీ చేసేందుకు గ్రౌండ్ వర్క్ ప్రిపేర్ చేసుకుంటున్నారనే చర్చ నడుస్తోంది. ఒకవేళ పునర్విభజన జరగకపోతే గత ఎన్నికల్లో పోటీ చేసిన ఆరేంజ్ ట్రావెల్స్ అధినేత సునీల్ రెడ్డి అభ్యర్దిగా ఉంటారని అంతా అనుకుంటున్నారట. గత ఎన్నికల్లో కేవలం 4533 ఓట్లతో ఓటమిపాలైన సునీల్ రెడ్డి.. నియోజకవర్గ ఇంచార్జీగా పార్టీలో చురుకుగా ఉన్నారు.

ప్రస్తుతానికి ఆయనే బలంగా ఉన్నప్పటికీ అదే నియోజకవర్గానికి చెందిన మాజీ డీసీసీ అధ్యక్షుడు మానాల మోహన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఈరవత్రి అనిల్ సైతం బాల్కొండపై కన్నేశారు. మాజీ ఎమ్మెల్యే అనిల్ ఎమ్మెల్సీ పదవి కోసం గట్టి ప్రయత్నాలు చేస్తుండటంతో.. ఆయన పోటీ నుంచి తప్పుకున్నటైందనే ప్రచారం జరుగుతోంది.దీంతో మాజీ డీసీసీ అధ్యక్షుడు.. గత ఎన్నికల్లో టికెట్ ఆశించి భంగ పడ్డాను.. ఈ సారి అవకాశం ఇవ్వాలంటూ పార్టీ పెద్దలకు విజ్ఞప్తి చేస్తు.. సెగ్మెంట్ పై ఖర్చీప్ వేశారట. నియోజకవర్గంలో తన వర్గాన్ని తయారు చేసుకుని పోటీలో ఉంటాననే సంకేతాలు ఇస్తున్నారు మానాల మోహన్ రెడ్డి. మాజీ డీసీసీ అధ్యక్షుని తీరుపై నియోజకవర్గ ఇంచార్జీ సునీల్ రె డ్డి గుర్రుగా ఉన్నారు. పార్టీలో గ్రూపులను ప్రోత్సహిస్తున్నారంటూ.. ఆయనపై అధిష్టానానికి ఫిర్యాదు సైతం చేసి, పార్టీ కార్యక్రమాలకు ఆహ్వానించడం మానేశారు సునీల్ రెడ్డి.

బాల్కొండ పై కన్నేసిన మానాలా ఈ సారి తగ్గేదే లే అంటున్నారు. నిన్నటి వరకు పోటీలో ఉంటానని సన్నిహితుల వద్ద చెప్పిన ఆయన తాజాగా మానాల లో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో పార్టీ పెద్దలందరితో పాటు నియోజకవర్గ ఇంచార్జీ సమక్షంలో రానున్న ఎన్నికల్లో బాల్కొండ నుంచి బరిలో ఉంటానని ప్రకటించారు. ఆ ప్రకటనతో స్టేజిపై ఉన్న నేతలంతా ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు. కష్టకాలంలో 10 ఏళ్లు జిల్లా అధ్యక్షునిగా పనిచేశానని, ఒక్క అవకాశం ఇవ్వాలని మోహన్ రెడ్డి కోరారు. ఈ ప్రకటనతో నియోజకవర్గ ఇంచార్టీ సునీల్ రెడ్డి సైతం తీవ్ర మనస్ధాపం చెందారని టాక్ నడుస్తోంది. పార్టీ పెద్దలు ఈ ప్రకటన పట్ల మౌనం వహించటం ఏంటని నిరాశ చెందారని గుసగుసలు వినిపిస్తున్నాయి. జిల్లాకు పెద్ద దిక్కుగా ఉన్న మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి మోహన్ రెడ్డి ప్రకటన పై వివరణ అడిగినట్లు సమాచారం. సునీల్ రెడ్డి మాత్రం పీసీసీ చీఫ్ కు మరోసారి ఫిర్యాదు చేశారని తెలిసింది. మోహన్ రెడ్డి ప్రకటన బాల్కొండ కాంగ్రెస్ శ్రేణుల్లో కొత్త చర్చకు దారితీసి, నియోజకవర్గ ఇంచార్జీ సీటుకు ఎసరు పెట్టారని కొందరు చెబుతుంటే.. మరికొందరు మాత్రం సునీల్ రెడ్డికి పెద్దల అండ ఉందనే చర్చిస్తున్నారు. బాల్కొండ అభ్యర్థిత్వం విషయంలో ఇద్దరు నేతల మధ్య పోరు తార స్థాయికి చేరింది. ఐతే జిల్లాకు పెద్దదిక్కుగా ఉన్న పెద్దాయన సుదర్శన్ రెడ్డి, పార్టీ చీఫ్ మహేష్ కుమార గౌడ్ ఆశిస్సులు ఎవరికి ఉంటాయన్నది ఆసక్తికరంగా మారిందట. మొత్తం మీద బాల్కొండలో అభ్యర్ధిత్వం రగడకు అధిష్టానం ఎలా పుల్ స్టాప్ పెడుతుందో వేచిచూడాలి.

