. . . మంత్రి లక్ష్మణ్ కుమార్ వినతి తో సిఎం రేవంత్ రెడ్డి తక్షణ స్పందన
. . . ఆరు లక్షల సిఎంఆర్ఎఫ్ నిధుల విడుదల కు ఆదేశం
జగిత్యాల, బతుకమ్మ :
రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో ప్రాణాలు కోల్పోయిన జగిత్యాల జిల్లా హస్నాబాద్ గ్రామానికి చెందిన వావిలాల సుదర్శన్ గౌడ్ కుటుంబాన్ని ఆదుకునేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మానవతా దృక్పథంతో స్పందించారు. ఉపాధి కోసం నాలుగు నెలల క్రితం ఉక్రెయిన్‌కు వెళ్లిన సుదర్శన్ గౌడ్ అక్కడ జరిగిన యుద్ధంలో క్షిపణులు, డ్రోన్ దాడుల నేపథ్యంలో ప్రాణాలు కోల్పోవడం పట్ల ముఖ్యమంత్రి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసి, సంతాపం తెలిపారు. ఈ విషాద సమయంలో బాధిత కుటుంబానికి ప్రభుత్వం అండగా నిలుస్తుందని భరోసా ఇచ్చారు. సుదర్శన్ గౌడ్ భార్య విజ్ఞప్తి మేరకు ఈ ఘటనను మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే స్పందించిన ముఖ్యమంత్రి బాధిత కుటుంబానికి రూ. 6 లక్షల ఆర్థిక సహాయం ప్రకటించారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి ఈ ఆర్థిక సహాయం అందించేందుకు అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. సుదర్శన్ గౌడ్ భౌతికకాయాన్ని స్వదేశానికి తీసుకురావడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
