. . . యాప్ పేరుతో దాదాపు రూ.5 కోట్ల పెట్టుబడులు సేకరణ
. . . నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
జగిత్యాల, బతుకమ్మ :
అధిక లాభాలు వస్తాయని నమ్మించి పెట్టుబడులు సేకరించిన కేసులో ఓ వ్యక్తిని జగిత్యాల పట్టణ పోలీసులు అరెస్ట్ చేశారు. అస్పెక్ట్ ట్రేడర్స్ యాప్ పేరుతో దాదాపు రూ.5 కోట్ల పెట్టుబడులు సేకరించి మోసం చేసినట్లు ఫిర్యాదు అందడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నరసింగపూర్ రోడ్‌కు చెందిన బెజ్జంకి అనిల్ కుమార్ పట్టణ పొలీసులకు పోలీసులకు ఫిర్యాదు చేశారు. చల్గల్ గ్రామానికి చెందిన మానాల మారుతి అనే వ్యక్తి అస్పెక్ట్ ట్రేడర్స్ అనే యాప్‌లో పెట్టుబడులు పెడితే భారీగా లాభాలు వస్తాయని నమ్మించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. కంపెనీ గోల్డ్‌పై ట్రేడింగ్ చేస్తుందని, పెట్టుబడిపై ప్రతిరోజూ ఒక శాతం లాభం ఇస్తామని, 100 రోజుల్లో పెట్టుబడి మొత్తం తిరిగి వస్తుందని, ఆ తర్వాత మరో 100 రోజుల్లో పెట్టుబడి రెట్టింపు అవుతుందని నమ్మించినట్లు పోలీసులు తెలిపారు. అంతేకాకుండా తమ కింద కొత్త ఇన్వెస్టర్లను చేర్పిస్తే వారికి, రిఫరల్ ఐడీ ఇచ్చిన వారికి కూడా లాభాలు వస్తాయని చెప్పినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ క్రమంలో తెనాలికి చెందిన కన్నెగంటి జనార్ధన్, గుంటూరుకు చెందిన మోహన్, నాగ్‌పూర్‌కు చెందిన ఇర్ఫాన్ తదితరుల సహకారంతో యాప్‌ను రూపొందించి పలువురి నుంచి దాదాపు రూ.5 కోట్ల మేర పెట్టుబడులు సేకరించినట్లు ఫిర్యాదులో ఆరోపించారు. దర్యాప్తులో భాగంగా నిందితుడు మానాల మారుతిని చల్గల్‌లోని అతని ఇంటి వద్ద పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతన్ని విచారించగా నేరాన్ని అంగీకరించినట్లు పోలీసులు తెలిపారు. అతని వద్ద నుంచి అస్పెక్ట్ ట్రేడర్స్ వెల్ కమ్ అస్పెక్ట్రా పేరుతో ఉన్న పత్రాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.అనంతరం నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు జగిత్యాల టౌన్ ఇన్‌స్పెక్టర్ కరుణాకర్ తెలిపారు.ఆన్‌లైన్‌లో అధిక లాభాల పేరుతో పెట్టుబడులు పెట్టే ముందు పూర్తి వివరాలు తెలుసుకోవాలని, అనుమానాస్పద పెట్టుబడి పథకాల విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు.
