27.7 C
Hyderabad

కల్లు ప్యాకెట్లపై ఎక్స్ పైరీ వివరాలు తప్పనిసరిగా ముద్రించాలి

Expiry details must be printed on toddy packets.

Must read

📰 Generate e-Paper Clip

 

. . . ఫుడ్ సేఫ్టీ అధికారికి ఆర్ఎస్ పీ వినతి

 

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ :

 

నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉన్న కల్లు డిపోలు, అలాగే జిల్లా కేంద్రంలోని కల్లు విక్రయ కేంద్రాల్లో సరఫరా చేస్తున్న కల్లు ప్యాకెట్లపై ఎక్స్ పైరీ తేదీ, తయారీ తేదీ, అందులో ఉపయోగించిన పదార్థాల పూర్తి వివరాలు, ఆల్కహాల్ శాతం వంటి సమాచారాన్ని ముద్రించడం లేదని, వాటిని తప్పనిసరిగా ముద్రించాలని కోరుతూ రివల్యూషనరీ సోషలిస్టు పార్టీ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఫుడ్ సేఫ్టీ ఇన్‌స్పెక్టర్ కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆర్ఎస్పీ జిల్లా కార్యదర్శి కటారి రాములు మాట్లాడుతూ కల్లు ప్యాకేట్లలో వినియోగదారులకు వారు తీసుకుంటున్న పానీయంలో ఎంత శాతం ఆల్కహాల్ ఉందో, చక్కెర శాతం ఎంత ఉందో, అది సహజసిద్ధంగా తాటి లేదా ఈత చెట్ల నుంచి సేకరించిన కల్లునా, లేక కృత్రిమంగా తయారు చేసినదా అనే విషయాలు తెలియడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. దేశంలో విక్రయించే ప్రతి మత్తు పదార్థంపై “మత్తు పదార్థాలు ఆరోగ్యానికి హానికరం” అనే హెచ్చరికను తప్పనిసరిగా ముద్రిస్తుంటారని, అయితే కల్లు ప్యాకెట్లపై అలాంటి హెచ్చరికలు లేకపోవడం సరైంది కాదన్నారు. వినియోగదారుల ఆరోగ్య పరిరక్షణ దృష్ట్యా కల్లు ప్యాకెట్లపై పదార్థాల వివరాలు, ఆల్కహాల్ శాతం, తయారీ తేదీ, ఎక్స్‌పైరీ తేదీతో పాటు ఆరోగ్య హెచ్చరికను కూడా తప్పనిసరిగా ముద్రించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. అదేవిధంగా జిల్లా వ్యాప్తంగా ఉన్న కల్లు డిపోల నుంచి నమూనాలు (శాంపిల్స్) సేకరించి ఫుడ్ సేఫ్టీ ప్రమాణాల ప్రకారం పరీక్షలు నిర్వహించి, నాణ్యతా ప్రమాణాలు పాటించని వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఫుడ్ సేఫ్టీ అధికారులను కోరారు. ఈ కార్యక్రమంలో ఆర్ఎస్ పీ పార్టీ నేతలు పీట్ల. నరేష్, గోపాల్ సింగ్ ఠాగూర్, సుర్యపాల్, లతో పాటు తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article