23.7 C
Hyderabad

ఏడీసీ పదవికి మేజర్ రిషభ్ రాజీనామా

Major Rishabh resigns from ADC post

Must read

📰 Generate e-Paper Clip

 

. . . రాష్ట్రపతి గురించి సంచలన విషయాలు

 

వెబ్ డెస్క్, బతుకమ్మ :

 

భారత సైన్యంలో విశేష సేవలందించి, దశాబ్ద కాలానికి పైగా దేశ రక్షణలో కీలక పాత్ర పోషించిన యువ మేజర్ రిషభ్ సింగ్ సంబ్యాల్ నిర్ణయం ఇప్పుడు తీవ్ర సంచలనం సృష్టిస్తోంది. దేశంలోనే అత్యున్నత పదవి అయిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు సుదీర్ఘ కాలం ఎయిడ్-డి-కాంప్ (ఏడిసి)గా వ్యవహరించి, సోషల్ మీడియాలో నేషనల్ క్రష్ గా పేరు తెచ్చుకున్న ఆయన.. కేవలం 30 ఏళ్ల వయస్సులోనే ఆర్మీకి ముందస్తు రాజీనామా ఇచ్చేశారు. 12 ఏళ్ల సుదీర్ఘ సైనిక ప్రస్థానానికి స్వస్తి పలకడం వెనుక ఉన్న బలమైన కారణాలు, ఆయన త్యాగాలు ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. జమ్మూ కాశ్మీర్‌లోని డోగ్రా రాజపుత్ర కుటుంబానికి చెందిన రిషభ్ సింగ్ సంబ్యాల్ సైనిక నేపథ్యం ఉన్న కుటుంబంలో జన్మించారు. 2013లో నేషనల్ డిఫెన్స్ అకాడమీ(ఎన్డిఏ) పరీక్షలో ఉత్తీర్ణులై 2017లో మిలిటరీ మేనేజ్‌మెంట్‌లో డిగ్రీ పూర్తి చేశారు. ఆర్మీలో చేరిన అతితక్కువ సమయంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన 4-పారా స్పెషల్ ఫోర్సెస్ కు ఎంపికయ్యారు. అసాధారణమైన ప్రతిభ,సాహసాలకు గుర్తుగా ఇచ్చే బలిదాన్ బ్యాడ్జ్ సాధించిన కొద్దిమంది వీరులలో రిషభ్ ఒకరు. 2021 రిపబ్లిక్ డే పరేడ్‌లో జాట్ రెజిమెంట్ బలగాలకు నేతృత్వం వహించి ‘బెస్ట్ మార్చింగ్ కాంటింజెంట్’ ట్రోఫీని గెలుచుకున్నారు. ఆయన పనితీరును గుర్తించి మార్చి 2023లో భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు అత్యంత నమ్మకమైన ఏడీసీగా నియమించారు.

. . . ఏడీసీ అంటే ఎంతటి పవర్‌ఫుల్ ఉద్యోగమో తెలుసా?

రాష్ట్రపతి వద్ద పనిచేసే ఎయిడ్-డి-కాంప్(ఏడీసీ) బాధ్యత చాలా సంక్లిష్టమైనది. రాష్ట్రపతి భద్రత, ప్రోటోకాల్, అధికారిక, వ్యక్తిగత అవసరాలను క్షణాల్లో నెరవేర్చడమే ఏడీసీ ప్రధాన విధి. రాష్ట్రపతి ప్రధానితో మాట్లాడాలన్నా, ఏ ఇతర దేశాధినేతలతో కమ్యూనికేట్ చేయాలన్నా మధ్యలో ముందుండి వ్యవహరించేది ఈ అధికారులే. ముందుగా వీరు మాట్లాడిన తర్వాతే రాష్ట్రపతికి ఫోన్ ఇస్తారు. రాష్ట్రపతి ఉండే ప్రాంతానికి కిలోమీటరు పరిధి వరకు ఎటువంటి ఆయుధాలు, ప్రమాదకర వస్తువులు లేకుండా సెక్యూర్ చేయాల్సి ఉంటుంది. అంతెందుకు, రాష్ట్రపతి తాగే మంచి నీటి గ్లాస్ నుంచి వారు కలిసే వ్యక్తుల వరకు ప్రతి చిన్న విషయాన్నీ ఏడీసీల బృందం నిశితంగా పరిశీలిస్తుంది. ఆఖరికి రాష్ట్రపతి కాళ్లకు నమస్కరించడానికి గానీ, చేతులు కలపడానికి గానీ ఎవరినీ అనుమతించకపోవడానికి కారణం వారి భద్రతేనని ఒక ఇంటర్వ్యూలో రిషభ్ వెల్లడించారు.

. . . వ్యక్తిగత జీవితమే లేని పసిడి బంధీలు!

అత్యున్నతమైన ఈ పదవి చూడటానికి ఎంతో వైభవంగా అనిపించినా, దాని వెనుక అపారమైన త్యాగాలు ఉన్నాయని రిషభ్ ఆవేదన వ్యక్తం చేశారు. “గత మూడేళ్లుగా నేను ఒక సాధారణ మనిషిలా బయటకు వెళ్లలేకపోయాను. నాకంటూ సొంత జీవితం లేకుండా పోయింది” అని ఆయన తెలిపారు. ఈ ఉద్యోగంలో ఉన్నంత కాలం వివాహం చేసుకోవడానికి వీల్లేదనే కఠినమైన నిబంధన కూడా ఉంది. కుటుంబానికి, స్నేహితులకు పూర్తిగా దూరమై కనీసం పెళ్లి కూడా చేసుకోలేని పరిస్థితి నెలకొనడంతో, సొంత జీవితాన్ని నిర్మించుకోవడానికే తీవ్ర మనోవేదన అనుభవించి ఆర్మీ నుంచి తప్పుకోవాలనే కఠిన నిర్ణయం తీసుకున్నట్లు ఆయన స్పష్టం చేశారు.

. . . ఆమెలో నా కన్నతల్లిని చూసుకున్నాను

కుటుంబానికి దూరంగా ఉంటున్న సమయంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో ఏర్పడిన అనుబంధాన్ని రిషభ్ ఎంతో భావోద్వేగంగా గుర్తుచేసుకున్నారు. 2014 నుంచి నేను ఇంట్లో కన్నతల్లితో గడిపిన సమయం చాలా తక్కువ. కానీ రాష్ట్రపతిని మొదటిసారి చూసినప్పుడు నా సొంత తల్లి ఎదురుగా నిలబడినట్లే అనిపించింది. మూడేళ్ల పాటు ఆమె నాపై చూపించిన వాత్సల్యం, మాతృప్రేమ నా తల్లిని గుర్తుచేసేవి” అని ఆయన చెప్పుకొచ్చారు. యూనిఫామ్ తెచ్చిపెట్టిన గౌరవాన్ని గుండెల్లో పదిలపరుచుకుంటూనే, తన వ్యక్తిగత జీవితానికి సమయం కేటాయించడం కోసం ఈ యువ మేజర్ తీసుకున్న నిర్ణయం అందరినీ ఆలోచింపజేస్తోంది.

Major Rishabh resigns from ADC post
Major Rishabh resigns from ADC post

More articles

Latest article