. . . ఎక్సైజ్ ఎస్హెచ్వో స్వప్న
నిజామాబాద్ క్రైం, బతుకమ్మ :
ఈత చెట్లు గీత కార్మికుల జీవనాధారంగా ఉన్నాయని, వాటి సంఖ్యను పెంచేందుకు మరిన్ని మొక్కలు నాటాల్సిన అవసరం ఉందని ఈతవనాల అభివృద్ధికి ప్రతి ఒక్కరూ సహకరించాలని ఎక్సైజ్ ఎస్హెచ్వో స్వప్న పేర్కొన్నారు. బుధవారం కల్లుగీత పారిశ్రామిక సహకార సంఘం నంబర్.2 ఆధ్వర్యంలో సంఘం అధ్యక్షుడు సత్యనారాయణ గౌడ్ నేతృత్వంలో ఈతవన మహోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ హెచ్ వో స్వప్న ఈత మొక్కలు నాటి, వాటి సంరక్షణపై అవగాహన కల్పించారు. పర్యావరణ పరిరక్షణకు ఈతవనాలు దోహదపడటంతోపాటు వాటిపై ఆధారపడే గీత కార్మిక కుటుంబాలకు జీవనోపాధిని అందిస్తున్నాయని అన్నారు. ఈత చెట్లను విస్తారంగా పెంచి సంరక్షించడంతో పచ్చదనాన్ని పెంచడమే కాకుండా గీత కార్మికుల సంప్రదాయ వృత్తికి అండగా నిలవచ్చని పేర్కొన్నారు. ఈత చెట్ల పెంపకం, సంరక్షణ ప్రాధాన్యాన్ని వివరించారు. నాటిన మొక్కలను కేవలం కార్యక్రమానికే పరిమితం చేయకుండా అవి ఎదిగే వరకు సంరక్షించాలని సూచించారు. ఇప్పటికే ఉన్న ఈతవనాలను కాపాడటంతోపాటు కొత్త వనాలను అభివృద్ధి చేయడం ద్వారా భవిష్యత్ తరాలకు ప్రయోజనం కలుగుతుందని తెలిపారు.ఈత చెట్లు పచ్చదనాన్ని పెంచడంతోపాటు పర్యావరణ సమతుల్యతకు దోహదపడతాయని, మరోవైపు కల్లు గీత ద్వారా గీత కార్మిక కుటుంబాలకు ఉపాధి లభిస్తుందని వివరించారు. అందువల్ల ఈతవనాల సంరక్షణను పర్యావరణ పరిరక్షణతోపాటు గీత కార్మికుల జీవనోపాధికి సంబంధించిన అంశంగా చూడాల్సిన అవసరం ఉందన్నారు.ఈతవనాల పెంపకం, సంరక్షణకు సమష్టిగా కృషి చేయాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఎక్సైజ్ ఎస్సైలు మల్లేష్, గంగాధర్, మమతతోపాటు కల్లుగీత పారిశ్రామిక సహకార సంఘం నంబర్ 2 డైరెక్టర్లు శ్రీహరి గౌడ్, బాలా గౌడ్, గంగాధర్ గౌడ్, దుర్గా గౌడ్ తోపాటు సంఘం సభ్యులు, గీత కార్మికులు, ఎక్సైజ్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
