మోర్తాడ్, బతుకమ్మ :
మోర్తాడ్ మండలంలో 80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు శనివారం ఘనంగా నిర్వహించారు. గ్రామంలోని వాడవాడలా మువ్వన్నెల జెండాలు రెపరెపలాడగా, దేశభక్తి నినాదాలతో పండుగ వాతావరణం నెలకొంది. పాఠశాలలు, యువజన సంఘాలు, యూనియన్ నాయకులు, కుల సంఘాల ఆధ్వర్యంలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను నిర్వహించారు. పాఠశాలల్లో విద్యార్థులు స్వాతంత్య్ర సమరయోధులు, జాతీయ నాయకుల వేషధారణలో పాల్గొని ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. గ్రామాల్లో విద్యార్థులు ర్యాలీలు నిర్వహించి ప్రజలకు స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. పలువురు విద్యార్థులు దేశభక్తి గీతాలు, సాంస్కృతిక కార్యక్రమాలతో అలరించారు. అనేక పాఠశాలల్లో విద్యార్థులకు వివిధ ఆటల పోటీలు నిర్వహించారు. పోటీల్లో విజేతలుగా నిలిచిన విద్యార్థులకు నిర్వాహకులు బహుమతులు అందజేసి అభినందించారు. వేడుకల్లో విద్యార్థులు, ఉపాధ్యాయులు, యువత, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

