ఇందల్వాయి, బతుకమ్మ :
ప్రభుత్వ పాఠశాలలో చదివి పదో తరగతి పబ్లిక్ పరీక్షల్లో అత్యుత్తమ మార్కులు సాధించిన విద్యార్థులకు గ్రామంలోని ప్రధాన జాతీయ జెండాను ఆవిష్కరించే అవకాశం కల్పిస్తున్నట్లు తీర్మాన్‌పల్లి గ్రామ సర్పంచ్ చింతల కిషన్, గ్రామ అభివృద్ధి కమిటీ చైర్మన్ ధర్పల్లి ప్రభాకర్ తెలిపారు. విద్యార్థుల్లో చదువుపై ఆసక్తి, పోటీతత్వాన్ని పెంపొందించాలనే ఉద్దేశంతో గ్రామ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో కొన్నేళ్లుగా ఈ సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నట్లు వారు వెల్లడించారు. ఇందులో భాగంగా 2025 – 26 విద్యా సంవత్సరంలో తీర్మాన్‌పల్లి ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి చదివి అత్యుత్తమ మార్కులు సాధించిన మేకల హర్షికకు ఈసారి జాతీయ జెండాను ఆవిష్కరించే అవకాశం లభించింది. ఆగస్టు 15 స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా గ్రామ సర్పంచ్ చింతల కిషన్, గ్రామ అభివృద్ధి కమిటీ చైర్మన్ ధర్పల్లి ప్రభాకర్ సమక్షంలో హర్షిక గ్రామంలోని ప్రధాన జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల్లో విద్య పట్ల ఆసక్తిని పెంచడంతో పాటు పోటీతత్వాన్ని పెంపొందించేందుకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ఇటువంటి అవకాశాలు కల్పించడం ద్వారా ఇతర విద్యార్థులు కూడా మెరుగైన ఫలితాలు సాధించేందుకు ప్రోత్సాహం లభిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ జరుగు రవి, గ్రామ కమిటీ సభ్యులు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయ బృందం, గ్రామ యువతతో పాటు పలువురు పాల్గొన్నారు.
