. . . సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు రమేష్ బాబు
మాక్లూర్, బతుకమ్మ :
ఐఎంఎల్ డిపో హమాలీ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు రమేష్ బాబు అన్నారు. ఈ విషయాన్ని కోరుతూ మాక్లూర్ మండల తహసీల్దార్‌కు సీఐటీయూ ఆధ్వర్యంలో గురువారం వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ 2023 అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టోలో హమాలీ కార్మికుల కోసం ప్రత్యేకంగా వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేస్తామని, హెల్త్ కార్డులు అందజేస్తామని ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. వ్యవసాయ మార్కెట్ యార్డులు, సివిల్ సప్లైస్, రైస్ మిల్లులు, దాల్ మిల్లులు, గిడ్డంగులు, వ్యాపార సంస్థలు, బజారు ముఠాలు, కోల్డ్ స్టోరేజీలు, కూరగాయలు–పండ్ల మార్కెట్లు, రైల్వే, సిమెంట్, స్టీల్ తదితర రంగాలతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో పనిచేస్తున్న హమాలీ కార్మికులు ప్రజలకు నిత్యావసర సరుకులు అందించడంలో కీలక పాత్ర పోషిస్తున్నారని తెలిపారు. నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగినా హమాలీల కూలీ రేట్లు పెరగలేదని, పని భద్రత, సామాజిక భద్రత, ఆరోగ్య రక్షణ, సంక్షేమ సౌకర్యాలు లేక వేలాది మంది హమాలీ కార్మికులు తీవ్ర ఆర్థిక, సామాజిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. ప్రభుత్వం ఏర్పడి రెండున్నర సంవత్సరాలు గడిచినా మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు అమలు కాలేదని, వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. అనంతరం సీఐటీయూ జిల్లా కమిటీ సభ్యులు కొండ గంగాధర్ మాట్లాడుతూ, ఐఎంఎల్ డిపో కార్మికుల్లో 50 సంవత్సరాలు పైబడిన హమాలీ కార్మికులకు నెలకు రూ.6,000 పెన్షన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రమాదాల్లో మృతి చెందిన కార్మికుల కుటుంబాలకు రూ.25 లక్షల పరిహారం చెల్లించాలని, కార్మికులందరికీ హెల్త్ కార్డులు అందించాలని కోరారు. ప్రభుత్వ సంస్థల్లో పనిచేస్తున్న హమాలీ కార్మికులను నాలుగో తరగతి ఉద్యోగులుగా గుర్తించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో హమాలీ సంఘం నాయకులు రమేష్, లక్ష్మణ్, రవీందర్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

