. . . అదనపు కలెక్టర్ భుజంగరావు
నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :
ప్రతి ఒక్కరూ ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపాలని, వ్యాధుల బారిన పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) భుజంగరావు సూచించారు. జిల్లాలో హెచ్‌ఐవీ/ఎయిడ్స్ నివారణ, నియంత్రణపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో రెండు నెలల పాటు నిర్వహించనున్న విస్తృత అవగాహన కార్యక్రమాన్ని ఆయన బుధవారం ప్రారంభించారు. జిల్లా కేంద్రంలోని అదనపు కలెక్టర్ కార్యాలయంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ బి. రాజశ్రీతో కలిసి ఎయిడ్స్ పై నిర్వహించనున్న ఐఐఈసీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా హెచ్‌ఐవీ/ఎయిడ్స్ కు సంబంధించిన ప్రమాదకర పరిస్థితులను తెలుసుకునేందుకు ఉపయోగపడే ‘బ్రేక్ ఫ్రీ యాప్’ క్యూఆర్ కోడ్ పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రభుత్వ ఆదేశాల మేరకు హెచ్‌ఐవీ/ఎయిడ్స్ నివారణలో భాగంగా జిల్లాలో విస్తృత ప్రచార కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు. జిల్లాలో ఈ అవగాహన కార్యక్రమాలు రెండు నెలల పాటు కొనసాగుతాయని తెలిపారు. డీఎంహెచ్ఓ మాట్లాడుతూ.. బుధవారం నుంచి రెండు నెలల పాటు జిల్లావ్యాప్తంగా వివిధ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా 200 కళాశాలలు, పాఠశాలల్లో విద్యార్థులకు, అలాగే 200 ఎంపిక చేసిన గ్రామాల్లో హెచ్‌ఐవీ/ఎయిడ్స్‌పై అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. యువతలో చైతన్యం పెంచేందుకు జిల్లా స్థాయి వ్యాసరచన పోటీలు నిర్వహించడంతో పాటు బైక్ ర్యాలీ కూడా చేపట్టనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ దేవి నాగేశ్వరి (టీబీ నియంత్రణ అధికారి), డిప్యూటీ డీఎంహెచ్‌ఓ డాక్టర్ సికందర్ నాయక్, ప్రోగ్రామ్ అధికారులు డాక్టర్ వెంకన్న, డాక్టర్ సుప్రియ, హెల్త్ ఎడ్యుకేటర్ గన్‌పూర్ వెంకటేష్, డీపీఎం సుధాకర్, సీపీఓ మొహిజ్ అహ్మద్, సీఎస్ఓ నవీన్, స్నేహ సొసైటీకి చెందిన సిద్దయ్య, డీపీఓ విశాల, హెచ్ఈఓ గోవర్ధన్, నాగరాజుతో పాటు వైద్య ఆరోగ్యశాఖ సిబ్బంది పాల్గొన్నారు. అలాగే స్నేహ సొసైటీ, వర్డు, పబ్లిక్ హెల్త్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా, వైఆర్‌జీ తదితర స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.

