. . . ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చాలి
. . . కాంగ్రెస్ నేతల ఆరోపణ
భీంగల్, బతుకమ్మ :
గ్రామ పంచాయతీలో సర్పంచ్‌కు బదులుగా ఉప సర్పంచ్ పెత్తనం సాగుతోందని మండల కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి రాగుల గంగా మోహన్, గ్రామ శాఖ అధ్యక్షుడు దాకటి స్వామి ఆరోపించారు. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని వారు డిమాండ్ చేశారు. ఈ మేరకు బడా భీంగల్ గ్రామంలో మండల కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి రాగుల గంగా మోహన్, గ్రామ శాఖ అధ్యక్షుడు దాకటి స్వామి, గ్రామస్తుల ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాగుల గంగా మోహన్ మాట్లాడుతూ.. సర్పంచ్‌గా గెలిచిన అనంతరం గ్రామంలోనే ఉంటూ ప్రజలకు అందుబాటులో ఉండి సేవ చేస్తానని హామీ ఇచ్చి, ప్రస్తుతం ప్రజలకు అందుబాటులో ఉండటం లేదని ఆరోపించారు. ఎన్నికల సమయంలో అనేక హామీలు ఇచ్చి ప్రజలను నమ్మించి గెలిచిన తర్వాత వాటిలో ఏ ఒక్కటీ అమలు చేయడం లేదని విమర్శించారు. ప్రధానంగా సొంత ఖర్చులతో గ్రామానికి అంబులెన్స్ ఏర్పాటు చేస్తామని, జిమ్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారని, ఆ హామీల పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. గ్రామంలో ప్రజలకు ఏదైనా సమస్య వస్తే సర్పంచ్‌ను కలుద్దామంటే ఆమె అందుబాటులో లేకపోవడంతో సమస్యలను ఎవరికి చెప్పుకోవాలో అర్థం కావడం లేదని అన్నారు. ఎన్నికల సమయంలో 24 గంటలు గ్రామంలోనే ఉంటూ ప్రజలకు సేవ చేస్తానని చెప్పడంతో నమ్మి ప్రజలు ఓట్లు వేశారని, గెలిచిన అనంతరం సర్పంచ్ భర్త ఉప సర్పంచ్ హోదాలో పెత్తనం చెలాయించడం ఏమిటని రాగుల గంగా మోహన్ ప్రశ్నించారు. సర్పంచ్ ప్రజలకు అందుబాటులో ఉండి గ్రామ అభివృద్ధిపై దృష్టి సారించాలని సూచించారు. గ్రామపంచాయతీ ప్రజా సమస్యలను పరిష్కరించాల్సింది పోయి ప్రైవేట్ పంచాయతీలకు అడ్డాగా మార్చారని వారు ఆరోపించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయడంతో పాటు గ్రామస్తులకు అందుబాటులో ఉండి సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ విలేకరుల సమావేశంలో గ్రామ శాఖ అధ్యక్షుడు దాకటి స్వామి, రాగుల లింబాద్రి, ఆకుల గంగాధర్, జంగం ప్రభు, రాగుల కిషన్, మాజీ ఎంపీటీసీ వల్లి, ముచ్కూర్ నరేష్, పల్లె మహిపాల్, సూల్ల భూమన్న, అయేటి రవీందర్, గురిజల రాజ గంగారం, దండు మహేష్ తదితరులు పాల్గొన్నారు.
