28.5 C
Hyderabad

మహంకాళి అమ్మవారికి మారు బోనం సమర్పించిన మంత్రి కొండా సురేఖ

Must read

📰 Generate e-Paper Clip

 

సికింద్రాబాద్, బతుకమ్మ :

 

ఆషాఢ బోనాల ఉత్సవాల్లో భాగంగా అటవీ, పర్యావరణ, దేవాదాయ ధర్మాదాయ శాఖామంత్రి కొండా సురేఖ సికింద్రాబాద్‌ ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి మంగళవారం మారు బోనం సమర్పించారు. ఆలయానికి చేరుకున్న మంత్రికి దేవాదాయ శాఖ డైరెక్టర్ హనుమంతరావు, అసిస్టెంట్ కమిషనర్ మనోహర్ రెడ్డి, ఆలయ అర్చకులు డప్పు చప్పుళ్లు, శివసత్తుల పూనకాల మధ్య ఘన స్వాగతం పలికారు. అనంతరం మంత్రి కొండా సురేఖ ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ప్రధానార్చకుల ఆధ్వర్యంలో జరిగిన మారు బోనం సమర్పణ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి అమ్మవారికి మారు బోనం సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు. బోనమెత్తిన మహిళలకు ఈ సందర్భంగా మంత్రి సురేఖ చీరె, సారె అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సికింద్రాబాద్‌ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి మారు బోనం కార్యక్రమంలో పాల్గొనడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. అమ్మవారికి సమర్పించిన బియ్యంతో మారు బోనం చేయడం తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాల్లో విశిష్టమైన ఆచారమని పేర్కొన్నారు. ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆశీస్సులతో తెలంగాణ ప్రజలంతా సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని మంత్రి ఆకాంక్షించారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే ఆషాఢ బోనాల పండుగను భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించుకోవడం ప్రతి ఒక్కరికీ గర్వకారణమన్నారు. ఈ ఏడాది ఆషాఢ బోనాల ఉత్సవాలను ప్రజలు ఆనందోత్సాహాలతో జరుపుకుంటున్నారని మంత్రి తెలిపారు. ప్రభుత్వ ఏర్పాట్లకు తోడు ప్రజల సహకారం కూడా తోడవడంతో బోనాల ఉత్సవాలు వైభవోపేతంగా జరుగుతున్నాయని ఆమె అన్నారు.

 

Minister Konda Surekha offered 'Maru Bonam' to Goddess Mahankali.

More articles

Latest article