. . . మిడ్ మానేర్ బ్యాక్ వాటర్‌కు వచ్చే పర్యాటకుల భద్రతకు చర్యలు
. . . జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే
రాజన్న సిరిసిల్ల, బతుకమ్మ :
మిడ్ మానేర్ బ్యాక్ వాటర్ పర్యాటకులు పోలీసుల సూచనలు, హెచ్చరికలను తప్పనిసరిగా పాటించాలని జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే సూచించారు. తంగళ్లపల్లి మండలం గోపాలరావుపల్లి గ్రామ శివారులోని మిడ్ మానేర్ బ్యాక్ వాటర్ ప్రాంతాన్ని జిల్లా ఎస్పీ సోమవారం పోలీసు అధికారులతో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా బ్యాక్ వాటర్ ప్రాంతంలో పర్యాటకుల భద్రత కోసం చేపడుతున్న చర్యలను ఎస్పీ పరిశీలించారు. పర్యాటకుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టాలని, నిరంతరం పెట్రోలింగ్ నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. బ్యాక్ వాటర్ పరిసరాల్లోని ప్రమాదకర ప్రాంతాలను గుర్తించి, పర్యాటకులు ఆయా ప్రాంతాల్లోకి వెళ్లకుండా అవసరమైన ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ముఖ్యంగా చిన్నారులు, కుటుంబాలతో వచ్చే పర్యాటకుల భద్రతపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. నీటి ప్రాంతాలకు దూరంగా ఉండాలని, ప్రమాదకర ప్రాంతాల్లోకి వెళ్లకుండా అప్రమత్తంగా వ్యవహరించాలని కోరారు. సరదా విషాదంగా మారకుండా ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు పాటించాలని సూచించారు. జిల్లా ఎస్పీ వెంట డీఎస్పీ నాగేంద్రచారి, పోలీసు సిబ్బంది ఉన్నారు.
