27.2 C
Hyderabad

కార్మిక వర్గాన్ని కార్పొరేట్ సంస్థలకు అనుకూలంగా మారుస్తుంది

Must read

📰 Generate e-Paper Clip

 

. . . రైతు, కార్మిక సంఘాలు

 

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :

 

మోదీ ప్రభుత్వం భారత రైతాంగ ప్రయోజనాలను దెబ్బతీస్తూ, కార్మిక వర్గాన్ని కార్పొరేట్ సంస్థలకు అనుకూలంగా మార్చే విధానాలను అవలంబిస్తోందని రైతు, కార్మిక సంఘాలు ఆరోపించారు. కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక, రైతు, ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ దేశవ్యాప్త జైల్ భరో కార్యక్రమంలో భాగంగా జిల్లాలో వివిధ రైతు, కార్మిక సంఘాలు సోమవారం ఆందోళన నిర్వహించాయి. రాజీవ్ గాంధీ ఆడిటోరియం నుంచి ధర్నా చౌక్ వరకు నాయకులు, కార్యకర్తలు ర్యాలీ చేపట్టారు. అనంతరం ధర్నా చౌక్ వద్ద రాస్తారోకో నిర్వహించడంతో వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయి ట్రాఫిక్ స్తంభించింది. ఆందోళన నేపథ్యంలో పోలీసులు పలువురు నాయకులను అరెస్టు చేసి వన్‌టౌన్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు ఏ. రమేష్ బాబు, ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షులు వై. ఓమయ్య, టీయుసీఐ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం. సుధాకర్, ఐఎఫ్ టియు జిల్లా అధ్యక్షులు బి. భూమయ్య, ఏఐపికెఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు బి. దేవారం, ఎఐకెఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు కే. భూమయ్య, ఎఐఎడబ్ల్యూయు రాష్ట్ర కార్యదర్శి పెద్ది వెంకట్రాములు, ఏఐకెఎంఎస్ రాష్ట్ర కార్యదర్శి భాస్కర్, జిల్లా అధ్యక్షులు వి. భూమయ్య తదితరులు మాట్లాడారు. ప్రభుత్వ రంగ సంస్థలను కార్పొరేట్ కంపెనీలకు అప్పగించే చర్యలను నిలిపివేయాలని డిమాండ్ చేశారు. కార్మికులు, రైతులు, వ్యవసాయ కూలీల రంగాలను నిర్వీర్యం చేసే విధానాలను కేంద్ర ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని కోరారు. క్విట్ ఇండియా స్ఫూర్తితో దేశవ్యాప్తంగా రైతు, కార్మిక సంఘాలు జైల్ భరో కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాయని నాయకులు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలని, కనీస వేతనాలను అమలు చేయాలని, పంటలకు కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ చేశారు. అలాగే విద్యుత్ సవరణ బిల్లును ఉపసంహరించుకోవాలని, అమెరికాతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాన్ని రద్దు చేయాలని, ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణను నిలిపివేయాలని కోరారు. పెరుగుతున్న పెట్రోల్, డీజిల్, గ్యాస్, నిత్యావసర వస్తువుల ధరలను తగ్గించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైనా ప్రజా వ్యతిరేక విధానాలను వెనక్కి తీసుకోవాలని, లేకపోతే దేశవ్యాప్తంగా కోట్లాది మంది కార్మికులు, రైతులు, వ్యవసాయ కూలీలను సంఘటితం చేసి ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని నాయకులు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వివిధ రైతు, కార్మిక సంఘాల నాయకులు వెంకన్న, రాజేశ్వర్, సురేష్, సాయరెడ్డి, హన్మండ్లు, శివకుమార్, మల్లికార్జున్, సత్యక్క, కిషన్ కిరణ్, ఒడ్డెన్న, నసీర్, గోవర్ధన్, భాను నర్సయ్య, సాయిలు, అలీ తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article