. . . జిల్లా నీటి పారుదల సలహా మండలి సమావేశంలో ప్రభుత్వ సలహాదారు పోచారం, ఎమ్మెల్యేలు
. . . నిజామాబాద్ కలెక్టర్ భవేష్ మిశ్రా అధ్యక్షతన కొనసాగిన సమావేశం
. . . వర్చువల్ ద్వారా పాల్గొన్న కామారెడ్డి కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్
నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :
నిజామాబాద్ ఉమ్మడి జిల్లా రైతాంగం ప్రయోజనాలను కాపాడడమే పరమావధిగా అధికారులు, ప్రజాప్రతినిధులు కలిసి సమిష్టిగా కృషి చేద్దామని శాసన సభ్యులు సూచించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం ప్రధాన సమావేశ మందిరంలో శనివారం నిజామాబాద్ కలెక్టర్ భవేష్ మిశ్రా అధ్యక్షతన జిల్లా నీటి పారుదల సలహా మండలి సమావేశం జరిగింది.

ప్రభుత్వ సలహాదారు, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి, నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ ఆర్.భూపతిరెడ్డి, అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా, ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేశ్ రెడ్డిలు విచ్చేయగా, కామారెడ్డి కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ వర్చువల్ విధానం ద్వారా పాల్గొన్నారు. ఉమ్మడి జిల్లాలోని నిజాంసాగర్, శ్రీరాంసాగర్, సింగూరు, కౌలాస్ నాలా, పోచారం, రామడుగు తదితర జలాశయాలలో నీటి నిల్వల స్థితిగతులు, ఆయకట్టు పంటలకు సాగు నీటిని అందించే వెసులుబాటు, ప్రత్యామ్నాయ పంటల ప్రణాళిక, పంటల వైవిద్యీకరణకై రైతులకు అవగాహన కల్పించడం తదితర అంశాలపై చర్చించారు.

ప్రభుత్వ సలహాదారు పోచారం శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ, వివిధ జలాశయాల ద్వారా యాసంగి పంటలకు సాగు నీటిని అందించేందుకు వీలుగా ప్రతీ సంవత్సరం రబీ సీజన్ సమయంలో జిల్లా నీటి పారుదల సలహా మండలి సమావేశాలు జరిగేవని గుర్తు చేశారు. అయితే ఈసారి ఎల్ నినో ప్రభావం వల్ల రైతులు నష్టపోకుండా తగిన చర్యలు తీసుకునేందుకు వీలుగా ప్రభుత్వ సూచనల మేరకు ఖరీఫ్ సీజన్ సమయంలోనే ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగిందన్నారు. ఎల్ నినో ప్రభావం వల్ల మునుముందు వర్షాలు తక్కువగా కురిసే అవకాశాలు ఉన్నందున, వరి పంట విత్తుకున్న రైతులు నష్టపోకుండా అధికారులు చొరవ చూపాలన్నారు. ఇంకా పంట వేసుకోని రైతులు ఆరుతడి పంటలు, కూరగాయలు, ఆయిల్ పామ్ సాగు చేసేలా రైతు వేదికల ద్వారా విస్తృత స్థాయిలో అవగాహన కల్పించాలని సూచించారు. ప్రస్తుతం నారు ముదిరిపోయినందున వరి నాట్లు వేసే సమయం మించిపోయిందని, ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయడమే మేలు చేకూరుస్తుందని అన్నారు. వ్యవసాయ, ఉద్యానవన, నీటి పారుదల, రెవెన్యూ తదితర శాఖల అధికారులు పరస్పర సమన్వయంతో పని చేస్తూ, క్షేత్రస్థాయిలో రైతులకు అవసరమైన తోడ్పాటును అందించాలని హితవు పలికారు.

నిజామాబాద్ కలెక్టర్ భవేష్ మిశ్రా మాట్లాడుతూ, ఇటీవల తుపాను ప్రభావంతో కొంతవరకు వర్షాలు కురిసినప్పటికీ, ఎల్ నినో కారణంగా ఆగస్టు, సెప్టెంబర్ మాసాలలో వర్షపాతం తక్కువగా నమోదయ్యే అవకాశాలు ఉన్నందున అందుబాటులో ఉన్న నీటి వనరులను ఎంతో జాగ్రత్తగా వినియోగించుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. ఇప్పటికే జిల్లాలో 3.96 లక్షల ఎకరాల విస్తీర్ణంలో వరి పంట వేసుకున్నారని, కమాండ్, నాన్ కమాండ్ ఏరియాలలో ఇంకనూ 45 వేల ఎకరాల విస్తీర్ణంలో పంటలు విత్తుకోవాల్సి ఉన్నందున వరికి బదులుగా జొన్న, మొక్కజొన్న, కూరగాయలు, పప్పుదినుసులు వంటి ఆరుతడి పంటలతో పాటు ఆయిల్ పామ్ సాగు చేసేలా రైతులను ప్రోత్సహించాలని వ్యవసాయ, ఉద్యానవన శాఖ అధికారులను ఆదేశించారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఆయిల్ పామ్ సాగు ఎంతో శ్రేయస్కరం అయినందున వ్యవసాయ విస్తరణ అధికారులు క్షేత్రస్థాయిలో రైతులకు అవగాహన కల్పించాలని అన్నారు. 80 టీ.ఎం.సీల పూర్తిస్థాయి సామర్ధ్యం కలిగిన శ్రీరాంసాగర్ రిజర్వాయర్ లో గత ఏడాది తరహాలోనే ఈసారి కూడా ప్రస్తుత సమయానికి 40 టీ.ఎం.సీల నీరు నిలువ ఉందన్నారు. అయితే ఈ రిజర్వాయర్ ద్వారా ఆయకట్టు పంటలకు ఏ మేరకు సాగునీటిని విడుదల చేయాలన్నది ఈ నెలాఖరు (ఆగస్టు చివరి వారం)లో రాష్ట్ర స్థాయిలో నిర్వహించనున్న శివం కమిటీ సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నారని తెలిపారు. నిజాంసాగర్ ప్రాజెక్టు కింద నిజామాబాద్ జిల్లాలో లక్షా 15 వేల ఆయకట్టు విస్తీర్ణం ఉందని, ఈ జలాశయంలో ప్రస్తుతం 10.78 టీ.ఎం.సీల నీరు నిలువ ఉన్నందున ఆయకట్టుకు మూడు నుండి నాలుగు తడులు సాగు నీటిని అందించేందుకు అవకాశం ఉందన్నారు. రైతులు వేసుకున్న వరి పంటను పరిరక్షించేలా, ఇంకనూ పంటలు విత్తుకోని భూములలో ఆరుతడి పంటలు, కూరగాయలు, ఆయిల్ పామ్ సాగు చేపట్టేలా రైతులను ప్రోత్సహించేందుకు వ్యవసాయ, ఉద్యానవన శాఖల అధికారులు క్షేత్రస్థాయిలో చిత్తశుద్ధితో కృషి చేయాలని సూచించారు.

కామారెడ్డి కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ మాట్లాడుతూ, నిజామాబాద్, కామారెడ్డి, మెదక్ జిల్లాల తాగునీటి అవసరాలకు ఉపయోగపడుతున్న సింగూర్ రిజర్వాయర్ కు మరమ్మతులు చేపడుతున్న కారణంగా సామర్ధ్యం మేరకు నీటిని నిలువ ఉంచే పరిస్థితి లేదని, ప్రస్తుతం నిలువ ఉన్న 4.140 టీ.ఎం.సీల నీటిని తాగునీటి సరఫరాకే వినియోగించాల్సిన పరిస్థితి ఉందన్నారు. ఇది 60 నుండి 90 రోజులకే సరిపోతుందని, దీనిని దృష్టిలో పెట్టుకుని వర్షాలు కురిసినట్లయితే మరో 4 టీ.ఎం.సీల వరకు వరద జలాలను సింగూర్ లో నిలువ చేయాల్సిన అవసరం ఉందని అన్నారు. తద్వారా పై మూడు జిల్లాలకు వచ్చే ఐదారు నెలల వరకు తాగునీటి సరఫరాకు ఇబ్బంది ఉండదని సూచించారు. భూగర్భ జలాలు గణనీయంగా వృద్ది చెందేలా జిల్లాలో జలసిరి కార్యక్రమాలను పెద్ద ఎత్తున చేపడుతున్నామని తెలిపారు. కామారెడ్డి జిల్లాలోని కౌలాస్ నాల, పోచారం ప్రాజెక్టులు పూర్తిస్థాయి నీటి మట్టాన్ని సంతరించుకున్నాయని, నిర్దేశిత ఆయకట్టుకు సాగు నీటిని అందించవచ్చని అన్నారు.

నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతిరెడ్డి మాట్లాడుతూ, ప్రస్తుత పరిస్థితుల్లో అందుబాటులో ఉన్న నీటి వనరులను ఎంతో జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఎక్కడ కూడా చెరువులకు గండ్లు పడకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. బోరుబావులపై ఆధారపడి అత్యధిక మంది రైతులు పంటలు సాగు చేస్తున్నందున భూగర్భ జలాలు వృద్ధి చెందేలా వాటర్ షెడ్ కార్యక్రమాలను విరివిగా చేపట్టాల్సిన అవసరం ఉందన్నారు.

ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేశ్ రెడ్డి మాట్లాడుతూ, నిజాంసాగర్ చివరి ఆయకట్టు ప్రాంతంగా ఉన్న ఆర్మూర్ నియోజకవర్గానికి కాలువలు సక్రమంగా లేక సాగర్ జలాలు అందడం లేదని అన్నారు. కేవలం గుత్ప ఎత్తిపోతల పథకం ద్వారా 40వేల ఎకరాలకు సాగు నీరు అందుతోందని తెలిపారు. దీనివల్ల అనేకమంది బతుకుదెరువు కోసం గల్ఫ్ కు వలస వెళ్ళారని, ప్రస్తుతం సాగునీటిని అందించకపోతే మరింత మంది గల్ఫ్ బాట పట్టే ప్రమాదం ఉందన్నారు. దీనిని దృష్టిలో పెట్టుకుని ఆర్మూర్, ఆలూర్, నందిపేట తదితర మండలాల లోని ఆయకట్టుకు ఎత్తిపోతల ద్వారానైనా సాగు నీటిని అందించాలని కోరారు.

నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ మాట్లాడుతూ, ఎల్ నినో పరిస్థితులను సవాల్ గా స్వీకరిస్తూ, అన్ని వర్గాల వారిని దీని ప్రభావం బారి నుండి కాపాడేలా అధికారులు సమగ్ర కార్యాచరణ ప్రణాళికను అమలు చేయాలని సూచించారు. తుపాను ప్రభావం వల్ల ఇటీవల కురిసిన వర్షాలు కొంత ఉపశమనం కలిగించాయని, అందుబాటులోకి వచ్చిన నీటి వనరులను వృధా కాకుండా పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకునేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. ఈ సమావేశంలో నిజామాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి, అదనపు కలెక్టర్ వి.భుజంగరావు, ట్రైనీ కలెక్టర్ సురేష్, డీ.ఆర్.ఓ గీత, ఇరిగేషన్, గ్రౌండ్ వాటర్, వ్యవసాయ, ఉద్యానవన తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు.

