కామారెడ్డి, బతుకమ్మ :
కామారెడ్డి పురపాలక సంఘంలో నెలకొన్న పలు సమస్యలను పరిష్కరించాలని కోరుతూ బీఆర్‌ఎస్ మున్సిపల్ కౌన్సిలర్ల బృందం జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్‌కు వినతిపత్రం సమర్పించింది. వైస్ చైర్‌పర్సన్ కాసర్ల గోదావరి స్వామి ఆధ్వర్యంలో కౌన్సిలర్లు కలెక్టర్‌తో పాటు లోకల్ బాడీస్ అసిస్టెంట్ కలెక్టర్ వై.వి. గిరిని కలిసి మున్సిపాలిటీలోని పరిపాలనా సమస్యలను వివరించారు. మున్సిపాలిటీలో పాలన గాడి తప్పిందని, కౌన్సిల్ సమావేశాలు క్రమం తప్పకుండా నిర్వహించకపోవడంతో వార్డుల్లో అభివృద్ధి పనులు నిలిచిపోయాయని బీఆర్‌ఎస్ నాయకులు ఆరోపించారు. గత ఆరు నెలలుగా పట్టణంలో చెత్త సేకరణ వ్యవస్థ సరిగా పనిచేయడం లేదని, దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. చెత్త సేకరణ కోసం కొత్త ఆటోల కొనుగోలుకు తక్షణ అనుమతులు ఇవ్వాలని వారు కోరారు. అలాగే మున్సిపల్ జేసీబీ వినియోగంపై కూడా కౌన్సిలర్లు అభ్యంతరం వ్యక్తం చేశారు. జేసీబీని బాధ్యతగల మున్సిపల్ అధికారి పర్యవేక్షణలో ఉంచి సక్రమంగా వినియోగించేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. మున్సిపల్ కార్యాలయంలో ప్రైవేటు వ్యక్తుల జోక్యం పెరిగిందని, సిబ్బందిపై వారు పెత్తనం చెలాయిస్తున్నారని ఆరోపిస్తూ సంబంధిత వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని కోరారు. కలెక్టర్ మంజూరు చేసిన మొరం టెండర్ల అమలులో అలసత్వం వహించిన అధికారులపై చర్యలు తీసుకోవాలని కూడా కౌన్సిలర్లు డిమాండ్ చేశారు. మున్సిపల్ అధికారుల మధ్య సమన్వయ లోపం కారణంగా పట్టణ ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ పార్టీకి చెందిన పలువురు మున్సిపల్ కౌన్సిలర్లు పాల్గొన్నారు.
