. . . సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు ఏ.రమేష్ బాబు
నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :
స్కీం వర్కర్లను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని, కనీస వేతనాలు అమలు చేయాలని, లేబర్ కోడ్లను రద్దు చేసి కార్మిక చట్టాలను అమలు చేయాలని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు ఏ.రమేష్ బాబు డిమాండ్ చేశారు. కేంద్ర కార్మిక సంఘాలు ఇచ్చిన పిలుపులో భాగంగా ఆగస్టు 10 న దేశవ్యాప్తంగా నిర్వహించనున్న నిరసన కార్యక్రమాల్లో ఆశా వర్కర్లు పాల్గొననున్నట్లు సీఐటీయూ తెలంగాణ ఆశా వర్కర్స్ యూనియన్ నిజామాబాద్ జిల్లా కమిటీ ప్రకటించింది. ఈ సందర్భంగా జైలు భరో కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో ఆశా వర్కర్లు పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు. జిల్లా కమిటీ సమావేశం అనంతరం జిల్లా వైద్యాధికారి కార్యాలయంలో ఏవో అధికారికి వినతిపత్రం అందజేశారు. అనంతరం రమేష్ బాబు మాట్లాడుతూ కార్మికుల సమస్యలను పరిష్కరించకపోతే రాబోయే రోజుల్లో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఆశా వర్కర్స్ యూనియన్ జిల్లా కార్యదర్శి సుకన్య, నాయకులు విజయ, స్వప్న, రేణుక నర్సు, చంద్రకళతో పాటు వివిధ మండలాల కార్యకర్తలు పాల్గొన్నారు.
