24.4 C
Hyderabad

ఉపాధ్యాయ సమస్యలు విద్యారంగ సమస్యలే

Must read

📰 Generate e-Paper Clip

 

. . . టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి డి.సత్యానంద్

 

ఏర్గట్ల, బతుకమ్మ :

 

ఉపాధ్యాయ సమస్యలన్నీ విద్యారంగ సమస్యలేనని, వాటి పరిష్కారంపై రాష్ట్ర ప్రభుత్వం, విద్యాశాఖ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని టీఎస్‌యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి డి. సత్యానంద్ ఆరోపించారు. ఉపాధ్యాయ, విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ (యుఎస్పీసీ) ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన నిరసన కార్యక్రమాల్లో భాగంగా ఏర్గట్ల మండలంలోని పలు పాఠశాలల్లో నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యాశాఖ అధికారుల వైఖరి కారణంగా ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు క్రమంగా బలహీనపడుతున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. విద్యారంగానికి 15 శాతం నిధుల కేటాయింపు హామీని ప్రభుత్వం విస్మరించిందని, నాణ్యమైన విద్య పేరుతో పాఠశాలల కుదింపునకు ప్రయత్నాలు జరుగుతున్నాయని విమర్శించారు. పూర్వ ప్రాథమిక తరగతుల ప్రారంభంపై ప్రభుత్వం చేస్తున్న ప్రకటనలు ఆచరణలో కనిపించడం లేదని అన్నారు. కేవలం యూకేజీ తరగతులకే పరిమితం చేయడం వల్ల తల్లిదండ్రులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో ప్రీప్రైమరీ తరగతులను మధ్యాహ్నం 12 గంటల వరకు మాత్రమే నిర్వహించడం వల్ల ఆ తర్వాత చిన్నారుల సంరక్షణపై తల్లిదండ్రుల్లో ఆందోళన నెలకొందన్నారు. ప్రాథమిక విద్యకు నష్టదాయకంగా ఉన్న జీఓ 25ను సవరించాలని డిమాండ్ చేశారు. ప్రతి ప్రాథమిక పాఠశాలకు ఇద్దరు ఉపాధ్యాయులను, 50 మంది విద్యార్థులు ఉన్న పాఠశాలల్లో ప్రతి తరగతికి ఒక ఉపాధ్యాయుడిని నియమించాలని కోరారు. కొత్త జిల్లాలకు డీఈఓ పోస్టులు, రెవెన్యూ డివిజన్ స్థాయిలో డిప్యూటీ ఈఓ పోస్టులు, ప్రతి మండలానికి ఎంఈఓ పోస్టులు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. సర్వీస్ నిబంధనలను పీఓ 2018కు అనుగుణంగా రూపొందించి పర్యవేక్షణ అధికారుల పోస్టులను భర్తీ చేయాలని, ఆగస్టు 15లోగా బదిలీలు, పదోన్నతుల ప్రక్రియ చేపట్టాలని యుఎస్పీసీ నాయకులు కోరారు. టెట్‌లో సర్వీస్ వెయిటేజ్ ఇవ్వాలని, స్పెషల్ టెట్‌ను సబ్జెక్టుల వారీగా నిర్వహించాలని, సీపీఎస్‌ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. 2003 డీఎస్సీ ఉపాధ్యాయులకు మెమో 57 ప్రకారం పాత పెన్షన్ విధానం అమలు చేయాలని, కేజీబీవీ, యూఆర్ఎస్, సమగ్ర శిక్ష కాంట్రాక్ట్ ఉద్యోగులకు కనీస వేతనాలు అమలు చేయాలని కోరారు. జీఓ 317 బాధితులకు న్యాయం చేయాలని, జీఓ 190ను అమలు చేయాలని, పెండింగ్ డీఏ బకాయిలను విడుదల చేయాలని, పీఆర్సీ నివేదికను వెంటనే తెప్పించి అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. డిమాండ్ల సాధన కోసం దశలవారీ పోరాటాలకు యుఎస్పీసీ పిలుపునిచ్చింది. ఆగస్టు 7న నల్ల బ్యాడ్జీలతో పాఠశాలల్లో భోజన విరామ సమయంలో నిరసనలు చేపట్టాలని, పీఆర్సీ ప్రకటించే వరకు ప్రతిరోజూ నల్ల బ్యాడ్జీలతో విధులకు హాజరు కావాలని నిర్ణయించింది. ఆగస్టు 12, 13 తేదీల్లో మండల కేంద్రాల్లో నిరసనలు, తహసీల్దార్లకు వినతిపత్రాలు అందజేయడం, ఆగస్టు 19న జిల్లా కేంద్రాల్లో ధర్నాలు నిర్వహించాలని ప్రకటించింది. ఆగస్టు 29న హైదరాబాద్‌లో రాష్ట్రస్థాయి మహాధర్నా నిర్వహించనున్నట్లు తెలిపారు. ప్రభుత్వం స్పందించకపోతే సెప్టెంబర్‌లో అసెంబ్లీ సమావేశాల సందర్భంగా వేలాది మంది ఉపాధ్యాయులతో చలో అసెంబ్లీ కార్యక్రమం చేపడతామని యుఎస్పీసీ నాయకులు హెచ్చరించారు. అన్ని ఉపాధ్యాయ సంఘాలు ఐక్యంగా పోరాటంలో భాగస్వామ్యం కావాలని, ఉపాధ్యాయులు సంఘాలకు అతీతంగా సమస్యల పరిష్కారం కోసం ఉద్యమంలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో టీఎస్‌యూటీఎఫ్ మండల అధ్యక్షుడు పి. గణేష్, ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

More articles

Latest article