. . . కేంద్ర మంత్రి సీఆర్ పాటిల్‌ను కోరిన సీఎం రేవంత్ రెడ్డి
వెబ్ డెస్క్, బతుకమ్మ :
ప్రాణహిత నదిపై నిర్మించ తలపెట్టిన తుమ్మిడిహెట్టి బ్యారేజీ ఎత్తు పెంపునకు మహారాష్ట్ర ప్రభుత్వం నుంచి అనుమతులు ఇప్పించాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్‌ను కోరారు. ఢిల్లీ పర్యటనలో బుధవారం ముఖ్యమంత్రి, రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో కలిసి జలశక్తి మంత్రిత్వ శాఖ కార్యాలయంలో కేంద్ర మంత్రితో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా తుమ్మిడిహెట్టి ప్రాజెక్టు ప్రాధాన్యతను సీఎం వివరించారు. ప్రాజెక్టుకు అనుమతులు మంజూరు చేయాలని కోరుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి తాను రాసిన లేఖ, దానిపై ప్రధానమంత్రి కార్యాలయం స్పందించి జలశక్తి శాఖకు పంపిన విషయాన్ని ప్రస్తావించారు. తుమ్మిడిహెట్టి వద్ద 148 మీటర్ల ఎత్తులో బ్యారేజీ నిర్మాణానికి గతంలోనే తెలంగాణ, మహారాష్ట్ర రాష్ట్రాల మధ్య ఒప్పందం కుదిరిందని సీఎం గుర్తుచేశారు. అయితే బ్యారేజీ ఎత్తును 148 మీటర్ల నుంచి 152 మీటర్ల వరకు పెంచే అంశంపై పుణెలోని సెంట్రల్ వాటర్ అండ్ పవర్ రీసెర్చ్ సెంటర్ (సీడబ్ల్యూపీఆర్ఎస్) అధ్యయనం నిర్వహించిందని తెలిపారు. సీడబ్ల్యూపీఆర్ఎస్ అధ్యయనం ప్రకారం 148 మీటర్ల ఎత్తులో బ్యారేజీ నిర్మించినా, 152 మీటర్ల ఎత్తులో నిర్మించినా ముంపు ప్రభావంలో పెద్దగా తేడా ఉండదని తేలిందని సీఎం పేర్కొన్నారు. ముంపులో సుమారు 50 శాతం నదీ గర్భంలోనే ఉంటుందని వివరించారు. 148 మీటర్ల ఎత్తులో బ్యారేజీ నిర్మిస్తే గ్రావిటీ ద్వారా నీటి సరఫరా సాధ్యం కాదని, దీంతో విద్యుత్ వినియోగ భారం పెరుగుతుందని సీఎం తెలిపారు. అందువల్ల 150 నుంచి 152 మీటర్ల ఎత్తులో బ్యారేజీ నిర్మాణానికి మహారాష్ట్రను ఒప్పించాలని కేంద్ర మంత్రి సీఆర్ పాటిల్‌ను కోరారు. 150 నుంచి 152 మీటర్ల ఎత్తులో బ్యారేజీ నిర్మిస్తే గ్రావిటీ ద్వారా నీటి సరఫరా సాధ్యమవుతుందని, దీని వల్ల విద్యుత్ ఖర్చు తగ్గుతుందని ముఖ్యమంత్రి వివరించారు. ఈ అంశంపై తెలంగాణ, మహారాష్ట్రల మధ్య త్వరగా సమావేశం ఏర్పాటు చేయాలని కేంద్ర మంత్రిని విజ్ఞప్తి చేశారు. తుమ్మిడిహెట్టి ప్రాజెక్టు పూర్తయితే వెనుకబడిన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సాగునీటి సౌకర్యం మెరుగుపడుతుందని సీఎం పేర్కొన్నారు. ప్రధానమంత్రి కార్యాలయం నుంచి లేఖ అందిందని కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్ తెలిపారు. ముందుగా కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) ఆధ్వర్యంలో సమావేశం ఏర్పాటు చేసి తెలంగాణ, మహారాష్ట్ర రాష్ట్ర స్థాయి అధికారులతో చర్చల ప్రక్రియ ప్రారంభిస్తామని చెప్పారు. అనంతరం ఇరు రాష్ట్రాల నీటిపారుదల శాఖ మంత్రులతో సమావేశం ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో ఎంపీలు అనిల్ కుమార్ యాదవ్, వేం నరేందర్ రెడ్డి, డాక్టర్ మల్లు రవి, రామసహాయం రఘురాంరెడ్డి, పోరిక బలరాం నాయక్, గడ్డం వంశీకృష్ణ, డాక్టర్ కడియం కావ్య, ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి ఏపీ జితేందర్ రెడ్డి, నీటిపారుదల శాఖ సలహాదారు ఆదిత్యనాథ్ దాస్, శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఈ. శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.
