25.3 C
Hyderabad
Wednesday, August 5, 2026

సింగరేణికి చారిత్రక విజయం ..!

Must read

📰 Generate e-Paper Clip

 

. . . సింగరేణి విస్తరణకు మరో కీలక అడుగు

 

. . . 12 ఏళ్ల తర్వాత సింగరేణికి కొత్త బొగ్గు బ్లాక్

 

. . . ప్రజా ప్రభుత్వ చొరవతోనే ఈ చారిత్రక విజయం

 

. . . డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

 

వెబ్ డెస్క్, బతుకమ్మ :

 

సింగరేణి సంస్థ భవిష్యత్తుకు బలమైన పునాది వేస్తూ, తెలంగాణ ఇంధన భద్రతను మరింత పటిష్ఠం చేసే కీలక విజయం సాధించినట్లు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఇంధన శాఖ మంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖ సోమవారం నిర్వహించిన ఆన్‌లైన్ వేలంలో మణుగూరు ఏరియాకు అత్యంత కీలకమైన పీకే ఓసీ-2 డిప్ సైడ్ బొగ్గు బ్లాక్ సింగరేణికి దక్కడం చారిత్రక ఘట్టమన్నారు. దాదాపు 12 ఏళ్ల తర్వాత సింగరేణికి కొత్త బొగ్గు బ్లాక్ లభించడం సంస్థ చరిత్రలో మైలురాయిగా నిలిచిందన్నారు. తెలంగాణ ప్రజల ఆస్తి అయిన సింగరేణిని పరిరక్షించి, విస్తరించాలన్న లక్ష్యంతో ప్రజా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల ఫలితంగానే ఈ విజయం సాధ్యమైందన్నారు. గత ప్రభుత్వం సింగరేణిని వేలంలో పాల్గొనకుండా నిర్లక్ష్యం చేయడంతో రాష్ట్రంలోని కీలక బొగ్గు బ్లాక్‌లు ప్రైవేట్ సంస్థలకు వెళ్లాయని, ప్రస్తుత ప్రభుత్వం చొరవతో సింగరేణికి మళ్లీ కొత్త బ్లాక్ దక్కిందన్నారు. పీకే ఓసీ-2 డిప్ సైడ్ గనిలో 120 మిలియన్ టన్నుల జీ-8 గ్రేడ్ నాణ్యమైన బొగ్గు నిల్వలు ఉన్నాయని, ఏటా 6 మిలియన్ టన్నుల చొప్పున 20 సంవత్సరాల పాటు బొగ్గు ఉత్పత్తి చేపట్టే అవకాశం ఉందన్నారు. దీంతో తెలంగాణ విద్యుత్ రంగానికి దీర్ఘకాలిక బొగ్గు సరఫరా భద్రత లభిస్తుందని, రాష్ట్ర ఇంధన భద్రత మరింత బలోపేతం అవుతుందని వివరించారు. మణుగూరు ఏరియా అస్తిత్వాన్ని కాపాడటంలో ఈ బ్లాక్ కీలకంగా మారనుందని, 2 వేల మందికి పైగా కార్మికులకు దీర్ఘకాలిక ఉపాధి భద్రత కల్పించడంతో పాటు స్థానిక ఆర్థిక వ్యవస్థకు ఊతమిస్తుందని తెలిపారు. ఒడిశాలోని నైనీ బొగ్గు బ్లాక్ కు అనుమతులు సాధించేందుకు స్వయంగా వెళ్లి స్థానిక ప్రజాప్రతినిధులు, ప్రజలతో చర్చించి సమస్యలు పరిష్కరించామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క గుర్తుచేశారు. ప్రస్తుతం అక్కడ బొగ్గు ఉత్పత్తి ప్రారంభమై, రాబోయే 36 సంవత్సరాల పాటు సింగరేణికి బలమైన ఆధారంగా నిలుస్తోందన్నారు. అలాగే తాడిచర్ల-2 బొగ్గు బ్లాక్ గత ప్రభుత్వం చర్యలు తీసుకోకపోగా, ప్రజా ప్రభుత్వం కేంద్రంతో సంప్రదింపులు జరిపి మైనింగ్ లీజులు మంజూరు చేయించిందన్నారు. ఈ గని ద్వారా 336 మిలియన్ టన్నుల బొగ్గు నిల్వలను 45 సంవత్సరాల పాటు వినియోగించుకునే అవకాశం ఉందని తెలిపారు. గత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల కోయగూడెం-3, సత్తుపల్లి-3 వంటి కీలక బ్లాక్‌లు ప్రైవేట్ సంస్థలకు వెళ్లాయన్నారు. ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి నాయకత్వంలో సింగరేణిని మరింత బలోపేతం చేయడం, కొత్త బొగ్గు బ్లాక్‌లను సాధించడం, ఉద్యోగ భద్రతను పెంపొందించడం, రాష్ట్ర విద్యుత్ అవసరాలకు దీర్ఘకాలిక బొగ్గు సరఫరా కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. మణుగూరు పీకే ఓసీ-2 డిప్ సైడ్ బ్లాక్ దక్కడంపై సింగరేణి యాజమాన్యానికి, కార్మిక సంఘాల నాయకులకు, కార్మికులందరికీ డిప్యూటీ సీఎం అభినందనలు తెలిపారు. భవిష్యత్తులో కోయగూడెం-3, సత్తుపల్లి-3 బ్లాక్‌లను కూడా సింగరేణికి దక్కేలా కృషి చేస్తామని, ఇతర రాష్ట్రాల్లో బొగ్గు గనుల సాధనతో పాటు క్రిటికల్ మినరల్స్ అన్వేషణలోనూ సింగరేణి విస్తరణకు ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతోందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వెల్లడించారు.

 

A historic victory for Singareni...!

More articles

Latest article