పంపిణీ లేక రిటర్న్ వెళ్తున్న సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు
నందిపేట్ బతుకమ్మ : ఆర్మూర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ మరియు బీజేపీ నాయకుల మధ్య ఆధిపత్య పోరు ప్రజలకు గడ్డు పరిస్థితులను తెచ్చిపెడుతోంది. స్థానిక ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి (బీజేపీ) మరియు ఆర్మూర్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి వినయ్ కుమార్ రెడ్డి మధ్య విభేదాలు తీవ్రతరం అవుతున్నాయి. ఈ రాజకీయ పోటీల కారణంగా ముఖ్యమంత్రి రిలీఫ్ ఫండ్ (సీఎంఆర్ఎఫ్) చెక్కుల పంపిణీ ఆలస్యం అవుతుండటంతో, లబ్ధిదారులకు అందాల్సిన సాయం సకాలంలో చేరటం లేదు. నందిపేట్ మండలంలో మంజూరైన సీఎంఆర్ఎఫ్ చెక్కులు సకాలంలో పంపిణీ కాకపోవడంతో 15కి పైగా చెక్కులు కాల పరిమితి దాటి తిరిగి వెనక్కి వెళ్ళిపోయినట్లు సమాచారం.వైద్యం కోసం అప్పు చేసిన లబ్ధిదారులు, చెక్కుల కోసం ఎదురుచూస్తున్న సమయంలో ఆలస్యం కావడం తొ మరింత ఆర్థిక ఒత్తిడిని ఎదుర్కొంటున్నారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బీజేపీ నేతలు ప్రోటోకాల్ ప్రకారం చెక్కులు పంపిణీ కావాలని వాదిస్తున్నా, కాంగ్రెస్ నేతలు తమ ప్రభుత్వం ఈ పథకాలను మంజూరు చేసి పంపిణీ చేసినట్లు పేర్కొంటున్నారు. ఈ రాజకీయ తర్జనభర్జన ప్రజలకు నష్టమవుతోందని స్థానికులు పేర్కొంటున్నారు.
రాజకీయ లొల్లి – ప్రోటోకాల్ మాట :
ప్రభుత్వ పథకాలను ప్రజా ప్రతినిధులు లేదా అధికారులు పంపిణీ చేయవలసి ఉన్నప్పటికీ, గ్రామ స్థాయి బీజేపీ నాయకులు తమ పార్టీ నుంచి పంపిణీ చేస్తున్నట్లు చూపి రాజకీయ లబ్ధి పొందడానికి ప్రయత్నిస్తున్నారని కాంగ్రెస్ నాయకులు ఆరోపిస్తున్నారు. రాజకీయ వాతావరణం మరింత ఉత్కంఠగా మారిపోతుండగా, ఈ పరిస్థితిని ప్రభుత్వం జోక్యం చేసుకుని పరిష్కరించాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.
