. . . నగర మేయర్ కూరగాయల ఉమారాణి
నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :
దేశ స్వాతంత్య్రం కోసం ప్రాణత్యాగం చేసిన మహనీయుల సేవలు, త్యాగాలు చిరస్మరణీయమని నగర మేయర్ కూరగాయల ఉమారాణి అన్నారు. ఆర్య సమాజ్ అనుబంధ సంస్థ షహీద్ రాధాకిషన్ శిక్షా సమితి ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆదివారం కంటేశ్వర్ రైల్వే కమాన్ సమీపంలో ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు షహీద్ రాధాకిషన్ మోదాని బలిదినోత్సవం, వందేమాతరం గీతం 150వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నగర మేయర్ కూరగాయల ఉమారాణి రమేష్ ముఖ్య అతిథిగా హాజరై షహీద్ రాధాకిషన్ మోదాని చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమానికి ముందు మేయర్ ఆదేశాల మేరకు మున్సిపల్ అధికారులు, సిబ్బంది ప్రాంగణంలో పారిశుద్ధ్య నిర్వహణ, తాగునీటి సరఫరా, ఇతర మౌలిక సదుపాయాల ఏర్పాట్లను పూర్తి చేశారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ షహీద్ రాధాకిషన్ మోదాని వంటి స్వాతంత్య్ర సమరయోధుల దేశభక్తి, అంకితభావం నేటి యువతకు స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. భారత జాతీయ చైతన్యానికి ప్రతీకగా నిలిచిన వందేమాతరం గీతం 150వ వార్షికోత్సవాన్ని జరుపుకోవడం ప్రతి భారతీయుడికి గర్వకారణమని మేయర్ తెలిపారు. ఈ గీతం ప్రతి ఒక్కరిలో దేశభక్తి భావాన్ని పెంపొందిస్తుందని అన్నారు. స్వాతంత్య్ర సమరయోధుల ఆశయాలను కొనసాగిస్తూ సమాజ అభివృద్ధి, జాతీయ సమైక్యత కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆమె పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిటీ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు మఠం రేవతి, సిటీ జనరల్ సెక్రటరీ స్వప్న, రాధాకిషన్ పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయులు, సిబ్బంది, ఆర్య సమాజ్ ప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

