జుక్కల్, బతుకమ్మ:
జుక్కల్ మండలంలోని ఖండెబల్లార్ గ్రామంలో గ్రామ సర్పంచ్ కృష్ణ ఆధ్వర్యంలో జరుగుతున్న ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను జుక్కల్ ఎంపీడీవో శ్రీనివాస్ పరిశీలించారు. ఈ సందర్భంగా నిర్మాణాల పురోగతిని తెలుసుకొని లబ్ధిదారులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఎంపీడీవో శ్రీనివాస్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం నిరుపేద కుటుంబాలకు ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేసి, వారి సొంత ఇంటి కలను సాకారం చేసేందుకు కృషి చేస్తోందన్నారు. ఇళ్ల నిర్మాణానికి సంబంధించిన బిల్లులను కూడా త్వరితగతిన మంజూరు చేయడానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అర్హులైన నిరుపేదలకు ఇందిరమ్మ ఇళ్ల మంజూరుపై ప్రత్యేక దృష్టి సారించిందని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రతి అర్హ కుటుంబం సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఖండెబల్లార్ గ్రామ ప్రజలు మాట్లాడుతూ, గ్రామంలోని అర్హులైన ప్రతి నిరుపేద కుటుంబానికి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేసి నిర్మాణాలు పూర్తిచేయాలని కోరారు. అలాగే జుక్కల్ నియోజకవర్గ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు తమ నియోజకవర్గంలో మరిన్ని అర్హులైన లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేసేలా కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు.
