28.7 C
Hyderabad
Saturday, August 1, 2026

కంటైనర్ గదుల్లో విద్యార్థులకు బోధన

Must read

📰 Generate e-Paper Clip

 

. . . గ్రేస్ ఫెల్లో స్కూల్ అనుమతి రద్దు చేయాలి

 

. . . పీఆర్టీయూ తెలంగాణ జిల్లా గౌరవ అధ్యక్షులు కృపాల్ సింగ్ సోడి

 

నందిపేట్, బతుకమ్మ :

 

నందిపేట్ మండలంలోని వన్నెల్‌కే గ్రామంలో నిర్వహిస్తున్న గ్రేస్ ఫెల్లో పాఠశాలలో విద్యార్థులకు కంటైనర్ గదుల్లో బోధన నిర్వహించడం తీవ్ర ఆందోళనకు గురిచేస్తోందని పీఆర్టీయూ తెలంగాణ జిల్లా గౌరవ అధ్యక్షులు కృపాల్ సింగ్ సోడి విమర్శించారు. అగ్గిపెట్టెలను తలపించే ఇరుకు గదుల్లో విద్యార్థులు ఇబ్బందులు పడుతూ చదువుకోవాల్సిన పరిస్థితి నెలకొన్నదని ఆయన పేర్కొన్నారు. పాఠశాలలో సరిపడా తరగతి గదులు, క్రీడా మైదానం, శిక్షణ పొందిన ఉపాధ్యాయులు వంటి కనీస మౌలిక సదుపాయాలు లేకపోయినా, సంబంధిత నందిపేట్ మండల విద్యాధికారి (ఎంఈఓ) జిల్లా విద్యాశాఖకు అనుమతుల కోసం ఎలా సిఫారసు చేశారో విచారణ జరపాలని ఆయన డిమాండ్ చేశారు. పాఠశాలను ప్రత్యక్షంగా పరిశీలించకుండా చెక్‌లిస్ట్, విజిట్ రిపోర్టులపై సంతకాలు చేసి పంపడం అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనమని ఆరోపించారు. అలాగే జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో సంబంధిత అధికారులు, సిబ్బంది పత్రాలను సక్రమంగా పరిశీలించకుండా అనుమతులు మంజూరు చేయడం బాధ్యతారాహిత్యమని కృపాల్ సింగ్ సోడి అన్నారు. పాఠశాలలో అవసరమైన సౌకర్యాలు లేకపోవడంతో పాటు శిక్షణ పొందని ఉపాధ్యాయులతో బోధన కొనసాగిస్తూ, కార్పొరేట్ పాఠశాల పేరుతో అధిక ఫీజులు వసూలు చేస్తున్నారని ఆరోపించారు. ఈ వ్యవహారంలో సంబంధిత నందిపేట్ ఎంఈఓపై తక్షణమే శాఖాపరమైన చర్యలు తీసుకుని సస్పెండ్ చేయాలని, వన్నెల్‌కేలోని గ్రేస్ ఫెల్లో పాఠశాల అనుమతిని వెంటనే రద్దు చేయాలని పీఆర్టీయూ తెలంగాణ జిల్లా గౌరవ అధ్యక్షులు కృపాల్ సింగ్ సోడి జిల్లా విద్యాశాఖ అధికారులను డిమాండ్ చేశారు.

 

Teaching students in container rooms

More articles

Latest article