నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :
ప్రభుత్వ ఆయుర్వేద వైద్యాశాల, నిజామాబాద్ ఆధ్వర్యంలో బోర్గం జెడ్పీహెచ్‌ఎస్ పాఠశాలలో మంగళవారం విద్యార్థినీ, విద్యార్థులకు ఉచిత ఆయుర్వేద, యోగ అవగాహన శిబిరం నిర్వహించారు. ఈ విషయాన్ని జిల్లా ఆయుష్ ఇన్‌చార్జి డాక్టర్ జె. గంగా దాస్ తెలిపారు. శిబిరంలో వర్షాకాలంలో వ్యాధులు రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, దినచర్య, రుతుచర్య, సీజనల్ వ్యాధుల నివారణకు పాటించాల్సిన ఆరోగ్య సూచనలు, అలాగే యోగ ప్రాముఖ్యత గురించి విద్యార్థులకు వివరించారు. ఆరోగ్యవంతమైన జీవనశైలికి ఆయుర్వేదం, యోగ ఎంతగానో దోహదపడతాయని పేర్కొన్నారు. ఈ సందర్భంగా యోగ విన్యాసాలను ప్రదర్శించి, ప్రాణాయామం, సూర్య నమస్కారాలు, ధ్యానం వల్ల కలిగే శారీరక, మానసిక ప్రయోజనాలను వివరించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు శంకర్, యోగ వైద్యుడు డాక్టర్ తిరుపతి, ఆయుష్ ఫార్మసిస్ట్ పురుషోత్తం, యోగ శిక్షకులు నమ్రత, రాజేందర్, ఆయుష్ సిబ్బంది, ఉపాధ్యాయులు, విద్యార్థినీ, విద్యార్థులు పాల్గొన్నారు.

