27.1 C
Hyderabad
Saturday, August 1, 2026

ప్రజల మౌలిక సదుపాయాల సమస్యలను తక్షణమే పరిష్కరించాలి

Must read

📰 Generate e-Paper Clip

 

. . . సీపీఐ నగర కార్యదర్శి నీలం సాయిబాబా

 

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :

 

నిజామాబాద్ నగర ప్రజలు ఎదుర్కొంటున్న మౌలిక సదుపాయాల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని సీపీఐ నగర కార్యదర్శి నీలం సాయిబాబా అన్నారు. సమస్యల పరిష్కారాన్ని డిమాండ్ చేస్తూ సీపీఐ(ఎంఎల్) న్యూ డెమోక్రసీ ఆధ్వర్యంలో మంగళవారం నిజామాబాద్ మున్సిపల్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి, మున్సిపల్ కమిషనర్‌కు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నగర అభివృద్ధి కోసం మాస్టర్ ప్లాన్‌కు అనుగుణంగా రోడ్లను అభివృద్ధి చేయాలని కోరారు. వినాయక్ నగర్ బైపాస్ రోడ్డును త్వరితగతిన పూర్తి చేయాలని, పద్మనగర్ రోడ్ నంబర్-1 నుంచి వినాయక్ నగర్‌కు వెళ్లే మార్గంలోని పులాంగ్ బ్రిడ్జి ప్రస్తుతం లోయర్ బ్రిడ్జిగా ఉండటంతో ప్రతి వర్షాకాలంలో ముంపునకు గురై ప్రజలకు ప్రమాదకరంగా మారుతోందని తెలిపారు. అందువల్ల అక్కడ శాశ్వత హై-లెవల్ బ్రిడ్జిని నిర్మించాలని డిమాండ్ చేశారు. పులాంగ్ వాగు పరిసర ప్రాంతాల్లో జరుగుతున్న ఆక్రమణలను వెంటనే తొలగించి, సిమెంట్ లైనింగ్ లేదా ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలని కోరారు. గత కొన్నేళ్లుగా పెండింగ్‌లో ఉన్న అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థను పూర్తిస్థాయిలో అందుబాటులోకి తీసుకురావాలని, నగర శివారు ప్రాంతాల్లో రోడ్లు, వీధిలైట్లు, డ్రైనేజీలు, మురుగు కాల్వలు, తాగునీటి వంటి మౌలిక సదుపాయాలను కల్పించాలని విజ్ఞప్తి చేశారు. అదే విధంగా ప్రధాన రహదారులు, గల్లీల్లోని సర్వీస్ రోడ్లు గుంతలతో అధ్వాన్నంగా మారి ప్రమాదాలకు కారణమవుతున్నాయని పేర్కొంటూ వాటిని వెంటనే మరమ్మతులు చేసి అభివృద్ధి చేయాలని కోరారు. అన్ని గల్లీల్లో డ్రైనేజీలు, కల్వర్టుల నిర్మాణం చేపట్టడంతో పాటు ప్రతి కాలనీలో చెత్త వ్యాన్లు, డస్ట్‌ బిన్లు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ప్రజల ఆహ్లాదం కోసం ఏర్పాటు చేసిన పార్కులను అభివృద్ధి చేసి, ఆక్రమణలకు గురికాకుండా రక్షించాలని కూడా కోరారు. ఈ అన్ని సమస్యల పరిష్కారం కోసం మున్సిపల్ కమిషనర్‌కు వినతిపత్రం అందజేసినట్లు తెలిపారు. ఈ ధర్నా కార్యక్రమంలో పీవైఎల్ జిల్లా అధ్యక్షుడు వనమాల సత్యం, ఐఎఫ్‌టీయూ నగర అధ్యక్షుడు డి. మల్లికార్జున్, నగర కార్యదర్శి శివకుమార్, భవన నిర్మాణ కార్మిక సంఘం నగర అధ్యక్షుడు మోహన్, అలాగే రాజు, దాసు, వీరయ్య, శంకర్, ఖలీమ్, సాయిలు, రమేష్ తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article