భిక్కనూరు, బతుకమ్మ :
భిక్కనూరు గ్రామపంచాయతీ అధికారుల తీరుపై గ్రామస్తులు శనివారం కామారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ఫిర్యాదు చేశారు. గ్రామస్తుల తరఫున ఇచ్చిన వినతిపత్రంలో పలు ఆరోపణలను ప్రస్తావించారు. గతంలో జిల్లా కలెక్టర్ ఇచ్చిన ఆదేశాలను భిక్కనూరు గ్రామపంచాయతీ ఈవో మహేష్ కుమార్ గౌడ్ పూర్తిగా అమలు చేయలేదని గ్రామస్తులు ఆరోపించారు. షెడ్డు పూర్తిగా తొలగించినట్లు పత్రిక ప్రకటన ఇచ్చినప్పటికీ, క్షేత్రస్థాయిలో మాత్రం తొలగింపు జరగలేదని ఫిర్యాదులో పేర్కొన్నారు. అలాగే, 2017లో ఎలాంటి అనుమతులు లేకుండా బోర్ వేయడం జరిగిందని, ప్రస్తుతం రాజకీయ ఒత్తిడితో నాలా కన్వర్షన్ చేయించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని గ్రామస్తులు కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. ఈ వ్యవహారానికి సంబంధించిన సర్వే నంబర్‌పై కామారెడ్డి జూనియర్ సివిల్ కోర్టులో OS 143/2020 కేసు పెండింగ్‌లో ఉందని, అందువల్ల ఎలాంటి అనుమతులు మంజూరు చేయవద్దని వారు కోరారు. ఫిర్యాదును స్వీకరించిన అదనపు కలెక్టర్, సంబంధిత ఎంఆర్ఓకు తగిన సూచనలు ఇస్తామని తెలిపారు. ఈ అంశంపై విచారణ జరిపి నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. గ్రామస్తులు భిక్కనూరు ఈవోపై కూడా కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు.
