. . . అందుకే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా
. . . బీజేపీ జిల్లా అధ్యక్షులు దినేష్ పటేల్ కులాచారి
నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :
దేశం ముందు, ఆ తర్వాతే పార్టీ, ఆఖరికే కార్యకర్తలు అనేది భారతీయ జనతా పార్టీ సిద్ధాంతమని, ఆ సిద్ధాంతానికి కట్టుబడే కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి రాజీనామా చేశారని బీజేపీ జిల్లా అధ్యక్షులు దినేష్ పటేల్ కులాచారి అన్నారు. భారతీయ జనతా పార్టీ జిల్లా కార్యాలయంలో సోమవారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ నీట్ పరీక్ష పేపర్ లీక్ వ్యవహారంలో ఆయన తప్పు ఏమీ లేకపోయినా, నైతిక బాధ్యత వహిస్తూ దేశ ప్రయోజనాల కోసం ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారని, ఆయన రాజీనామాతో ప్రధాని మోడీ ఓడిపోయారని కొంత మంది దేశ వ్యతిరేక శక్తులు రాక్షసానందం పొందుతున్నాయన్నారు. పాఠ్యాంశాల నుండి అక్బర్, బీర్బల్, మొఘలుల చరిత్రను తొలగించి, ఈ దేశపు గొప్ప మహనీయుల చరిత్రను పాఠ్యాంశాలుగా చేర్చినందుకు ప్రధాని నరేంద్ర మోడీ, ధర్మేంద్ర ప్రధాన్ పై కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ తమ అక్కసును వెళ్లగక్కుతున్నారన్నారు. నీట్ పేపర్ లీక్ అయిన వెంటనే ప్రధాని ప్రత్యేక చొరవ తీసుకుని, విద్యార్థులు ఒక విద్యా సంవత్సరం కోల్పోకుండా వెంటనే తిరిగి పరీక్షలు నిర్వహించేలా ఆదేశించి నిజమైన సత్తా ఉన్న విద్యార్థులకు న్యాయం చేశారన్నారు. ఇటీవల విద్యార్థుల పేరుతో ధర్నాలు చేసిన వారు విదేశీ శక్తుల ధనబలంతో, వారి ప్రేరేపణతోనే ఈ ఆందోళనలు చేశారని, విద్యార్థుల ముసుగులో చేసిన ఈ ఆందోళనల్లో శ్రీరాముడిని, సీతమ్మ తల్లిని, భారతమాతను అవమానించారని మండిపడ్డారు. ఇది విద్యార్థుల ఆందోళనలా కాకుండా భారతదేశాన్ని విచ్ఛిన్నం చేసే కుట్రలా ఉందని, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలైన కర్ణాటక, రాజస్థాన్ లతో పాటు కేరళ, తమిళనాడు, పశ్చిమ బెంగాల్, పంజాబ్ తదితర రాష్ట్రాల్లో పీయూసీ, పీఎస్సీ, గ్రూప్-బి పరీక్షల పేపర్లు లీక్ అయినప్పుడు అక్కడి ముఖ్యమంత్రులు లేదా విద్యాశాఖ మంత్రులు ఎవరైనా రాజీనామా చేశారా ? అని ప్రశ్నించారు. రాజస్థాన్ కాంగ్రెస్ మంత్రి గోవింద్ సింగ్ ను ప్రశ్నిస్తే “నాకేం సంబంధం, అది అధికారుల బాధ్యతని తప్పించుకున్నారని, తెలంగాణలో గత ప్రభుత్వ హయాంలో ఇంటర్మీడియట్, ఎస్ఎస్సి, గ్రూప్-1, 2, 3 పేపర్లు లీక్ అయినప్పుడు ఎవరైనా బాధ్యత వహిస్తూ రాజీనామా చేశారా ? అప్పటి మంత్రి కేటీఆర్ ను ప్రశ్నిస్తే “ఆ పరీక్షలకు నాకేం సంబంధమని బాధ్యతారాహిత్యంగా సమాధానం చెప్పారన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి క్యాండిల్ ర్యాలీలు తీయడం విడ్డూరంగా ఉందని, రాష్ట్రంలో 20 లక్షల మంది విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్, బీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు స్కాలర్షిప్ లు ఇవ్వనందుకు సిగ్గుపడి ఈ క్యాండిల్ ర్యాలీ తీశారా ? అని ప్రశ్నించారు. 21 సంవత్సరాలకే జెన్ జెడ్ యువతకు ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఇవ్వాలంటున్న సీఎం రేవంత్.. తన మంత్రివర్గంలో ఎంతమంది జెన్ జెడ్ లకు అవకాశం ఇచ్చారో చెప్పాలని, దమ్ముంటే ఆయన రాజీనామా చేసి ఒక జెన్ జెడ్ యువకుడిని ముఖ్యమంత్రిని చేయాలని సూచించారు. ప్రజాస్వామ్యం గురించి మాట్లాడే ప్రకాష్ రాజ్.. ఎమర్జెన్సీ విధించి రాజ్యాంగాన్ని, దేశాన్ని తూట్లు పొడిచిన వారి పక్కనే తిరుగుతున్నారని, గత 12 సంవత్సరాలుగా ప్రధాని నరేంద్ర మోడీ ఒక్క అవినీతి మరక లేకుండా సుపరిపాలన అందిస్తున్నారన్నారు. దేశం ‘వికసిత్ భారత్’ దిశగా అడుగులేస్తున్న తరుణంలో దేశ వ్యతిరేక శక్తులు, కమ్యూనిస్టు భావజాలం ఉన్నవారు ఇటువంటి ఆందోళనల ద్వారా దేశాన్ని ముక్కలు చేయాలని చూస్తున్నారని, కానీ దేశ ప్రజలకు నరేంద్ర మోడీ పాలన పైన పూర్తి విశ్వాసం ఉందని గుర్తు చేశారు. ప్రజలంతా ఎల్లప్పుడూ మోడీ వెంటే ఉంటారని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో పొతన్ కార్ లక్ష్మీనారాయణ, ప్రమోద్ కుమార్, జ్యోతి, శివ ప్రసాద్, ఓం సింగ్, కిషోర్, రాము, కల్పే అర్చనా, పిల్లి శ్రీకాంత్, విజయ్, పురుషొతం , అన్నం గోపి, గంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
