. . . ఏడాదిలో ఏడు టన్నుల గంజాయి స్వాధీనం
. . . గంజాయి సప్లయ్ ను విచ్చిన్నం చేయడమే లక్ష్యం
. . . మత్తు పదార్థాల నేరాలకు పాల్పడుతున్న వారిపై పీడీ యాక్టు కేసులు
. . . విలేకరుల సమావేశంలో ఈగల్ ఫోర్స్ సూపరింటెండెంట్ గిరిధర్
నిజామాబాద్ క్రైం, బతుకమ్మ :
గంజాయి, డ్రగ్స్ విక్రయాలు, అక్రమ రవాణాను అరికట్టేందుకు రాష్ట్ర ఈగల్ ఫోర్స్ పక్కా ప్రణాళికలతో ముందుకు సాగుతోందని, హైదరాబాద్‌తో పాటు దేశవ్యాప్తంగా కొనసాగుతున్న గంజాయి సరఫరాలను విచ్ఛిన్నం చేయడానికి కేంద్ర దర్యాప్తు సంస్థలు, పొరుగు రాష్ట్రాల పోలీసులతో సమన్వయం చేసుకుంటూ సంయుక్త ఆపరేషన్లు నిర్వహిస్తోందని ఈగల్ ఫోర్స్ సూపరింటెండెంట్ గిరిధర్ అన్నారు. జిల్లా కేంద్రంలోని పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత ఏడాది కాలంలో ఈగల్ ఫోర్స్ వివిధ రాష్ట్రాల సరిహద్దుల్లో ప్రత్యేక దాడులు నిర్వహించి దాదాపు 7 టన్నుల గంజాయిని స్వాధీనం చేసుకుందన్నారు. అంతేకాకుండా గంజాయి అక్రమ రవాణాలో పాల్గొంటున్న ముఠాలపై నిఘా పెంచి కేంద్ర సంస్థలు, ఇతర రాష్ట్రాల చట్ట అమలు సంస్థలతో సమన్వయంగా భారీ సంయుక్త ఆపరేషన్లు నిర్వహిస్తూ సరఫరా నెట్‌వర్క్ ను ఛేదించడంపై ప్రత్యేక దృష్టి సారిస్తోందన్నారు. కేంద్ర, రాష్ట్ర సంస్థలతో కలిసి ఈగల్ ఫోర్స్ సంయుక్త ఆపరేషన్లు ఈగల్ ఫోర్స్ కేంద్ర దర్యాప్తు సంస్థలైన నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో, డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ తో పాటు ఆంధ్రప్రదేశ్, ఒడిశా, ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర రాష్ట్రాల పోలీసులతో సమన్వయంగా పలు కీలక సంయుక్త ఆపరేషన్లు నిర్వహించిందన్నారు. రాంచీ ఆపరేషన్ లో ఈగల్ ఫోర్స్, ఎన్‌సీబీ సంయుక్త ఆపరేషన్‌లో రాంచీలో 500 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారని, ఒడిశాలోని కోరాపుట్ సదర్ పోలీసులతో కలిసి నిర్వహించిన దాడిలో 500 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారన్నారు. రాయ్‌పూర్ సమీపంలోని ఛత్తీస్‌గఢ్ సరిహద్దు ప్రాంతంలో నిర్వహించిన ఆపరేషన్‌లో 500 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకోగా, ఛత్తీస్‌గఢ్ మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతంలో నిర్వహించిన సంయుక్త దాడిలో 500 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. సరఫరా గొలుసు విచ్ఛిన్నమే ప్రధాన లక్ష్యంమని గంజాయి, డ్రగ్స్ అక్రమ రవాణాను పూర్తిగా అరికట్టాలంటే కేవలం రవాణాదారులపై చర్యలు తీసుకోవడం మాత్రమే కాకుండా,మొత్తం సరఫరా గొలుసును విచ్ఛిన్నం చేయడం అవసరమని ఈగల్ ఫోర్స్ భావిస్తోందన్నారు. అందులో భాగంగా గంజాయి, డ్రగ్స్ వినియోగాన్ని తగ్గించడం ద్వారా వాటిపై డిమాండ్‌ను తగ్గించి, అక్రమ సరఫరాకు అడ్డుకట్ట వేయాలనే లక్ష్యంతో చట్ట అమలు చర్యలతో పాటు ప్రజల్లో అవగాహన కార్యక్రమాలను కూడా నిర్వహిస్తోందన్నారు.
. . . సప్లయ్ చైన్ విచ్ఛిన్నమే లక్ష్యం
గంజాయి, డ్రగ్స్ కు ఉన్న డిమాండ్‌ను తగ్గించడం ద్వారా అక్రమ సరఫరా గొలుసును పూర్తిగా తెంచివేయవచ్చని ఈగల్ ఫోర్స్ భావిస్తోందన్నారు. ఈ దిశగా నిరంతర చర్యల ఫలితంగా రాష్ట్రంలో గంజాయి అక్రమ విక్రయాలను గణనీయంగా తగ్గించడంలో విజయం సాధించిందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్, ఒడిశా ప్రాంతాల నుంచి హైదరాబాద్ మీదుగా మహారాష్ట్ర, కర్ణాటక తదితర రాష్ట్రాలకు గంజాయిని తరలిస్తున్న వ్యవస్థీకృత ముఠాలపై ఈగల్ ఫోర్స్, ఇంటెలిజెన్స్ విభాగాలతో కలిసి నిరంతర నిఘా కొనసాగిస్తోందన్నారు. అంతర్‌రాష్ట్ర అక్రమ రవాణా నెట్‌వర్క్‌లను గుర్తించి, వాటిని ఛేదించేందుకు ప్రత్యేక వ్యూహాలతో సంయుక్త ఆపరేషన్లు నిర్వహిస్తోందన్నారు. అంతర్‌రాష్ట్ర గంజాయి అక్రమ రవాణా ముఠాలపై వరుసగా విజయవంతమైన దాడులు నిర్వహించి భారీ మొత్తంలో గంజాయిని స్వాధీనం చేసుకోవడంతో పాటు అక్రమ సరఫరా నెట్‌వర్క్ లను ఛేదించినందుకు ఈగల్ ఫోర్స్ దేశవ్యాప్తంగా విశేష గుర్తింపు పొందిందన్నారు.
. . . నిజామాబాద్ యాంటీ నార్కోటిక్స్ విభాగం విజయాలు
సమాజంలో మత్తు పదార్థాల వినియోగం, అక్రమ రవాణా విక్రయాలను పూర్తిగా అరికట్టే లక్ష్యంతో నిజామాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలోని యాంటీ నార్కోటిక్స్ విభాగం, ఎన్‌డిపీఎస్ చట్టం – 1985 ప్రకారం పలు కేసులు నమోదు చేసి నిందితులను అరెస్టు చేయడంతో పాటు ఆల్ప్రాజోలమ్ మాత్రలు, గంజాయి, ఇతర సంబంధిత సొత్తును స్వాధీనం చేసుకుందన్నారు. మత్తు పదార్థాల సరఫరా గొలుసును పూర్తిగా నిర్మూలించేందుకు ప్రత్యేక నిఘా, ఇంటెలిజెన్స్ ఆధారిత దాడులు, అవగాహన కార్యక్రమాలను నిరంతరం నిర్వహిస్తోందన్నారు. ఆదిలాబాద్ జిల్లా తలమడుగు పోలీస్ స్టేషన్ లో 864 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకోగా,అంచనా విలువ రూ.4,32,00,000 ఉంటుందన్నారు. నిజామాబాద్ కమిషనరేట్ పరిధిలో బోధన్ రూరల్ పోలీస్ స్టేషన్ 2.500 కిలోల ఆల్ప్రాజోలమ్ స్వాధీనం చేసుకోగా దాని విలువ రూ.27,50,000 కాగా, వనపర్తి జిల్లాలో పెబ్బేర్ పోలీస్ స్టేషన్ లో 500 గ్రాముల ఆల్ర్పాజోలం, నిజామాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్ 600 గ్రాముల ఆల్ప్రాజోలమ్ స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. నగరంలోని 4వ పోలీస్ స్టేషన్ పరిధిలో 157.23 గ్రాముల ఆల్ప్రాజోలమ్ స్వాధీనం చేసుకోగా, ముప్కాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో 610 గ్రాముల ఆల్ప్రాజోలమ్ స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. నిజామాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో 156 గ్రాముల ఆల్ప్రాజోలమ్, ఆర్మూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో 500 గ్రాముల ఆల్ప్రాజోలమ్, నందిపేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో 167.5 గ్రాముల ఆల్ప్రాజోలమ్, కామారెడ్డి జిల్లా జుక్కల్ పోలీస్ స్టేషన్ పరిధిలో 21 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఆల్ప్రాజోలమ్ సుమారు 5.206 కిలోలు స్వాధీనం చేసుకోగా దాదాపు దాని ధర రూ.52,06,000గా ఉంటుందన్నారు. ఆల్ప్రాజోలమ్ , గంజాయి ఇతర మత్తు పదార్థాల అక్రమ రవాణా, నిల్వ, విక్రయాలకు పాల్పడే వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు కొనసాగుతాయని పోలీసులు స్పష్టం చేశారు. 2014 నుండి 2026 వరకు చేపట్టిన నిరంతర చర్యల ఫలితంగా రాష్ట్రంలో గంజాయి వినియోగం తగ్గుముఖం పట్టిందన్నారు. 2024లో నమోదైన 8 కమర్షియల్ క్వాంటిటీ కేసులు, 2025లో 2 కేసులకు తగ్గడం ఈ చర్యల ప్రభావాన్ని సూచిస్తోందన్నారు. 2025,2026 సంవత్సరాలలో 165 మంది డ్రగ్స్/గంజాయి వినియోగదారులను గుర్తించి సంబంధిత పోలీస్ స్టేషన్లకు అప్పగించామన్నారు. 2024-26 వరకు మొత్తం 492 అవగాహన కార్యక్రమాలు నిర్వహించామన్నారు. వాటిలో 192 కార్యక్రమాలు కల్తీ కల్లు, మత్తు పదార్థాల దుష్ప్రభావాలపై ప్రత్యేకంగా నిర్వహించబడ్డాయని తెలిపారు. మత్తు పదార్థాల నేరాలకు పాల్పడుతున్న మునావర్ అలీ, షేక్ అలీమా, గంధం శ్రీనివాస్ గౌడ్, మల్లెపూల లక్ష్మణ్ గౌడ్ పీడీ యాక్టు చట్టం కింద నిర్బంధ చర్యలు చేపట్టే ప్రక్రియ కొనసాగుతోందన్నారు. మత్తు పదార్థాల నేరాలకు పాల్పడే వారిపై ఎన్‌డీపీఎస్ చట్టం ప్రకారం కేసులు నమోదు చేసి, చట్టపరమైన చర్యలు తీసుకొని కోర్టు ద్వారా జైలుకు పంపించడం జరుగుతుందన్నారు. ప్రతి పౌరుడు యాంటీ డ్రగ్ సోల్జర్ గా బాధ్యతతో వ్యవహరించాలని విజ్ఞప్తి చేశారు. డ్రగ్స్ విక్రయం, కొనుగోలు, రవాణా, గంజాయి సాగు, నిల్వ లేదా వినియోగానికి సంబంధించిన సమాచారం తెలిసిన వెంటనే నిర్భయంగా పోలీసులకు తెలియజేయాలన్నారు. సమాచారం అందించేందుకు యాంటీ డ్రగ్ టోల్ ఫ్రీ నంబర్ 1908, వాట్సాప్ నంబర్ : 8712671111కు ఇవ్వాలని, సమాచారం అందించిన వారి వివరాలు పూర్తిగా గోప్యంగా ఉంచబడతాయన్నారు. గంజాయి వద్దు ప్రాణం ముద్దు” అనే సందేశాన్ని ప్రతి యువకుడు, ప్రతి కుటుంబం ఆచరణలో పెట్టాలని, మత్తు పదార్థాలకు దూరంగా ఉండి ఆరోగ్యకరమైన, బాధ్యతాయుతమైన జీవితాన్ని గడపడం ప్రతి ఒక్కరి బాధ్యత అన్నారు. ఈ విలేకరుల సమావేశంలో నార్కోటిక్ ఏసీపీ సోమనాథం, సిఐ పూర్ణేశ్వర్ లు పాల్గొన్నారు.
