. . . ఇద్దరు నిందితుల అరెస్ట్
. . . రెండు బైక్ లు, రెండు సెల్ ఫోన్ లు స్వాధీనం
రుద్రూర్, బతుకమ్మ :
రుద్రూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీసులు వాహనాలు తనిఖీలు నిర్వహిస్తుండగా ఇద్దరు వ్యక్తులు అనుమానస్పదంగా కనిపించడంతో వారిని పట్టుకుని తనిఖీలు చేయగా 5 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుని ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి రెండు ద్విచక్ర వాహనాలు, రెండు సెల్ ఫోన్ లను కూడా స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న గంజాయి విలువ సుమారు రూ.50 వేలు ఉంటుందని పోలీసులు తెలిపారు. సోమవారం రుద్రూర్ పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బోధన్ ఏసిపి శ్రీనివాస్ మాట్లాడుతూ.. జూలై 26న మధ్యాహ్నం సుమారు 2 గంటల సమయంలో గంజాయి తరలిస్తున్నారనే సమాచారం మేరకు రుద్రూర్ పోలీసులు అంబం రోడ్డు వద్ద ఉన్న హెచ్ పి పెట్రోల్ బంక్ సమీపంలో వాహన తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలో రెండు వేరు వేరు ద్విచక్ర వాహనాలపై అనుమానాస్పదంగా వస్తున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకుని తనిఖీ చేశారు. వారి వాహనాలలో పెట్రోల్ ట్యాంక్ కవర్లలో ప్లాస్టిక్ కవర్లలో దాచిన గంజాయిని గుర్తించారు. ఒకరి వద్ద 3 కిలోలు, మరొకరి వద్ద 2 కిలోలు మొత్తం 5 కిలోల గంజాయి లభించిందని పేర్కొన్నారు. అరెస్ట్ అయిన నిందితులను బీహార్ రాష్ట్రానికి చెందిన బల్వంత్ కుమార్ సింగ్ (37), కోటగిరి మండలంలోని వినాయక్ నగర్ కు చెందిన కర్కెల్లి సంజీవ్ (37) గా పోలీసులు గుర్తించారు. విచారణలో బల్వంత్ కుమార్ సింగ్ కొంతకాలంగా కామాకి రైస్ మిల్లులో పనిచేస్తున్నట్లు, సుమారు మూడు సంవత్సరాల క్రితం కోటగిరిలోని బాలాజీ రైస్ మిల్లులో పనిచేస్తున్న కర్కెల్లి సంజీవ్ తో పరిచయం ఏర్పడినట్లు పోలీసులు తెలిపారు. అనంతరం ఇద్దరూ కలిసి రైస్ మిల్లుల్లో పనిచేసే హమాలీలకు గంజాయి విక్రయించి డబ్బు సంపాదించాలని నిర్ణయించుకున్నట్లు వెల్లడించారు. బల్వంత్ కుమార్ సింగ్ బీహార్ కు చెందిన రాహుల్ అనే వ్యక్తి వద్ద నుంచి గంజాయి తీసుకువచ్చి, సంజీవ్ తో కలిసి రైస్ మిల్లుల్లో పనిచేసే హమాలీలకు విక్రయిస్తున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. ఈ విధంగా వచ్చిన డబ్బును ఇద్దరూ పంచుకునేవారని పోలీసులు తెలిపారు. జూలై 26 న గంజాయిని విక్రయించేందుకు ద్విచక్ర వాహనాలపై వెళ్తుండగా పోలీసులు వారిని పట్టుకున్నట్లు తెలిపారు. వీరికి గంజాయి సరఫరా చేసిన బీహార్ కు చెందిన రాహుల్ ప్రస్తుతం పరారీలో ఉన్నట్లు పోలీసులు పేర్కొన్నారు. అదేవిధంగా, వీరి వద్ద నుంచి గంజాయి కొనుగోలు చేసి వినియోగించిన ఏడుగురిపై కూడా కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. ఈ కేసు దర్యాప్తులో సహకరించిన ఏసీపీ సీసీఎస్, చీతాఫోర్స్ ఏసీపీ బోధన్, రుద్రూర్ సీఐతో పాటు పోలీసు సిబ్బందిని పోలీస్ కమిషనర్ అభినందించారు. నిషేధిత మత్తు పదార్థాలు, మాదక ద్రవ్యాలను విక్రయించినా, సరఫరా చేసినా చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని ఏసీపీ శ్రీనివాస్ బోధన్ హెచ్చరించారు. మాదక ద్రవ్యాలకు సంబంధించిన సమాచారం ఎవరికైనా తెలిసినట్లయితే వెంటనే పోలీసులకు లేదా టోల్ ఫ్రీ నంబర్ 1908కు సమాచారం అందించాలని సూచించారు. ఈ సమావేశంలో రుద్రూర్ సీఐ కృష్ణ, ఎస్సై మనోజ్ కుమార్, కోటగిరి ఎస్సై శ్రీనివాస్, పోలీసు సిబ్బంది ఉన్నారు.
