. . . కాంగ్రెస్ పార్టీ అగ్ర నేతలు అరెస్టుకు నిరసనగా ధర్నా
ఇందల్వాయి, బతుకమ్మ :
నీట్ పరీక్ష పేపర్ లీక్ ఘటనపై నిరసన వ్యక్తం చేస్తూ కాంగ్రెస్ పార్టీ నాయకులు బుధవారం ఇందల్వాయి మండల కేంద్రంలోని ఆర్టీసీ ప్రయాణ ప్రాంగణంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే పిలుపు మేరకు, తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు కొమ్మ మహేష్ కుమార్ గౌడ్ సూచనలతో ఈ కార్యక్రమం నిర్వహించినట్లు నాయకులు తెలిపారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు చింతల కిషన్ మాట్లాడుతూ, నీట్ పరీక్ష పేపర్ లీక్‌కు పాల్పడిన వారిపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, నష్టపోయిన విద్యార్థులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద శాంతియుతంగా నిరసన చేపట్టిన విద్యార్థులపై బీజేపీ ప్రభుత్వం విచక్షణారహితంగా వ్యవహరించిందని ఆరోపించారు. నీట్ సమస్యపై కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, మల్లికార్జున్ ఖర్గే, కర్ణాటక ముఖ్యమంత్రి, పలువురు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రులు ధర్నాలో పాల్గొన్నారని తెలిపారు. అయితే కాంగ్రెస్ నాయకులను అరెస్టు చేయడం అన్యాయమని ఆయన పేర్కొన్నారు. నీట్ పేపర్ లీక్‌కు కారణమైన వారిపై చర్యలు తీసుకోవాల్సింది పోయి, నిరసన చేస్తున్న కాంగ్రెస్ నాయకులపై చర్యలు తీసుకోవడం సరికాదని చింతల కిషన్ అన్నారు. దేశవ్యాప్తంగా విద్యార్థులు, నిరుద్యోగులు కేంద్ర ప్రభుత్వ తీరుపై ఆందోళన వ్యక్తం చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు. ఈ నిరసన కార్యక్రమంలో మాజీ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షు డు నవీన్ గౌడ్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు గంగారెడ్డి, సర్పంచులు లోకని గంగమని, గంగారం, సుజాత శ్రీనివాస్, రోహిత్ గౌడ్, శిరీష, మైపాల్ నాయక్, సంగీత దిలీప్ కుమార్, హేమలత తదితరులతో పాటు కాంగ్రెస్ నాయకులు ఈర్ల సాహేందర్, కరుణాకర్, వసంతరావు, బాబురావు, కుమార్ నాయక్, పాల్తే రాజు నాయక్ తదితరులు పాల్గొన్నారు.

