26.2 C
Hyderabad
Monday, August 3, 2026

రైతులకు అందుబాటులో ఉంటూ సూచనలు అందించాలి

Must read

📰 Generate e-Paper Clip

 

. . . ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి

 

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :

 

ఎల్ నినో కారణంగా వర్షాభావ పరిస్థితులు నెలకొన్న ప్రస్తుత తరుణంలో వ్యవసాయ అధికారులు క్షేత్రస్థాయిలో రైతులకు అందుబాటులో ఉంటూ, అవసరమైన సలహాలు, సూచనలు అందించాలని ప్రభుత్వ సలహాదారు పి.సుదర్శన్ రెడ్డి సూచించారు. మంగళవారం సాయంత్రం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో కలెక్టర్ ఇలా త్రిపాఠి తో కలిసి ఆయన వ్యవసాయ, నీటి పారుదల, ఆర్.డబ్ల్యూ.ఎస్, మున్సిపల్ తదితర శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఆయా మండలాల వారీగా పంటల సాగు వివరాలు, తాగునీటి సరఫరా తీరుతెన్నుల గురించి అడిగి తెలుసుకున్నారు. క్షేత్రస్థాయిలో సందర్శిస్తూ రైతులు ఏ రకం పంటలు వేశారన్నది పరిశీలించాలని వ్యవసాయ అధికారులకు సూచించారు. ఇంకనూ పంట విత్తుకోని రైతులు తక్కువ నీటి అవసరం అయ్యే ఆరుతడి పంటలు, ఆకు కూరలు, పందిరి కూరగాయల సాగు చేపట్టేలా ప్రోత్సహించాలని అన్నారు. వర్షాభావ పరిస్థితుల గురించి ప్రతి రైతుకు అవగాహన కల్పించాలని, తేమ నీటితో సాగయ్యే పంటల గురించి వారికి తెలియజేయాలన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఆయిల్ పామ్ సాగు ఎంతో మేలు అని, ఈ దిశగా రైతులు ముందుకు వచ్చేలా చూడాలన్నారు. ఇప్పటికే జిల్లాలో 6500 ఎకరాలలో ఆయిల్ పామ్ సాగు అవుతోందని, ఈ సంవత్సరం మరో 2 వేల ఎకరాల విస్తీర్ణంలో ఈ పంట సాగు జరిగేలా లక్ష్యం మేరకు కృషి చేయాలని అన్నారు. వివిధ రకాల పంటల సాగు కోసం అవసరమైన విత్తనాలను రైతులకు అందుబాటులో ఉంచాలని సూచించారు. నేల స్వభావాన్ని బట్టి అనుకూలమైన పంటలు వేసుకునేందుకు వీలుగా భూసార పరీక్షలు జరిపించి, వాటి వివరాలు రైతులకు తెలుపాలని అన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రతి ఒక్కరూ రైతాంగానికి వెన్నుదన్నుగా నిలవాలని హితవు పలికారు. అదే విధంగా జిల్లాలో ఎక్కడ కూడా తాగునీటి సరఫరాకు ఇబ్బంది తలెత్తకుండా ముందస్తుగానే కార్యాచరణ ప్రణాళికతో వ్యవహరించాలని సూచించారు. ఆయా జలాశయాలలో అందుబాటులో ఉన్న నీటి వనరులను జాగ్రత్తగా వినియోగించాలని, నీటి వృథా జరగకుండా పర్యవేక్షణ చేయాలని అన్నారు. సమీక్షా సమావేశంలో రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ హందాన్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ గవర్నింగ్ కౌన్సిల్ చైర్ పర్సన్ డాక్టర్ కవితా రెడ్డి, అదనపు కలెక్టర్ భుజంగరావు, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.

 

They should remain accessible to farmers and provide guidance.

More articles

Latest article