. . . పత్రాలు లేని వాహనాలు స్వాధీనం
నిజామాబాద్ క్రైం, బతుకమ్మ :
నగరంలోని 6వ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అసద్‌బాబా నగర్‌లో ఉన్న రాజీవ్ గృహకల్ప అపార్ట్ మెంట్లలో శనివారం కార్డన్ & సెర్చ్ కార్యక్రమం నిర్వహించారు. నిజామాబాద్ ఏసీపీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ తనిఖీల్లో భాగంగా సరైన ధ్రువపత్రాలు లేని ఒక కారు, ఐదు ఆటోలు, 35 మోటార్ సైకిళ్లను గుర్తించి తదుపరి విచారణ నిమిత్తం పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా ఏసీపీ స్థానికులకు పలు సూచనలు చేశారు. మైనర్లు వాహనాలు నడపకుండా తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకోవాలని, ప్రతి ఇంట్లో భద్రత కోసం సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. అలాగే సైబర్ మోసాలకు గురైనట్లయితే ఆలస్యం చేయకుండా వెంటనే 6వ టౌన్ పోలీసులకు సమాచారం అందించాలని తెలిపారు. ప్రజల భద్రత, నేరాల నియంత్రణలో భాగంగానే ఇలాంటి తనిఖీలు నిర్వహిస్తున్నామని పోలీసులు తెలిపారు.
