29 C
Hyderabad
Monday, August 3, 2026

పాఠశాలల కుదింపు నిర్ణయం రాజ్యాంగ విరుద్ధం

Must read

📰 Generate e-Paper Clip

 

. . . డీటీఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు పి. శంతన్

 

కమ్మర్‌పల్లి, బతుకమ్మ :

 

రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల సంఖ్యను 27 వేల నుంచి 4 వేలకే పరిమితం చేయాలనే ఆలోచన రాజ్యాంగ విరుద్ధమని డెమొక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్ (డీటీఎఫ్) రాష్ట్ర ఉపాధ్యక్షులు పి. శంతన్ విమర్శించారు. కమ్మర్‌పల్లి మండలంలోని వివిధ ప్రభుత్వ పాఠశాలలను సందర్శించిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఇటీవల సింగపూర్‌లో జరిగిన ది హిందూ ప్రెస్ సమ్మిట్‌లో ముఖ్యమంత్రి చేసిన ఈ ప్రకటన రాజ్యాంగంలోని ఆర్టికల్ 21ఏ కల్పించిన ఉచిత, నాణ్యమైన విద్య హక్కుకు విరుద్ధమని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి కారణంగా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నమోదు శాతం ఒకప్పుడు 50 శాతం ఉండగా ప్రస్తుతం 34 శాతానికి పడిపోయిందని తెలిపారు. ఉపాధ్యాయ ఖాళీలు భర్తీ చేయకపోవడం, కనీస మౌలిక వసతులు కల్పించకపోవడం, నాన్-టీచింగ్ సిబ్బంది పోస్టులను భర్తీ చేయకపోవడం, తరగతి గదులు, ప్రయోగశాలలు, మరుగుదొడ్లు వంటి సదుపాయాల కొరత వల్లే విద్యార్థులు ప్రైవేటు పాఠశాలల వైపు మొగ్గు చూపుతున్నారని అన్నారు. జీవో నంబర్ 25 ద్వారా విద్యార్థుల సంఖ్య ఆధారంగా ఉపాధ్యాయుల నియామకం చేపట్టడం వల్ల ప్రాథమిక పాఠశాలల్లో ఐదు తరగతులకు ఒకరు లేదా ఇద్దరు ఉపాధ్యాయులే పనిచేసే పరిస్థితి ఏర్పడిందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. 60 మంది విద్యార్థులతో ఐదు తరగతులు ఉన్న పాఠశాలలో ఇద్దరు ఉపాధ్యాయులు ఎలా నాణ్యమైన బోధన అందిస్తారో ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. జీవో 25ను రద్దు చేసి ప్రతి తరగతికి ఒక ఉపాధ్యాయుడిని నియమించడంతో పాటు ప్రభుత్వ పాఠశాలల్లో అవసరమైన మౌలిక వసతులు కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ సందర్భంగా డీటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు ఎం. బాలయ్య మాట్లాడుతూ, ఐదేళ్లకొకసారి జరగాల్సిన వేతన సవరణ (పీఆర్సీ) గడువు ముగిసి మూడేళ్లు దాటినా ప్రభుత్వం పీఆర్సీ నివేదికను తెప్పించుకోలేదని విమర్శించారు. తక్షణమే పీఆర్సీ నివేదికను తెప్పించి 40 శాతం ఫిట్‌మెంట్‌తో అమలు చేయాలని డిమాండ్ చేశారు. అలాగే రిటైర్డ్ ఉపాధ్యాయుల బకాయిలు, ఉపాధ్యాయుల పెండింగ్ బిల్లులను వెంటనే చెల్లించాలని, పెండింగ్‌లో ఉన్న ఐదు డీఏలను విడుదల చేయాలని కోరారు. పాఠశాలలు ప్రారంభమై నెల రోజులు గడిచినా విద్యార్థులకు యూనిఫారాలు, పాఠ్యపుస్తకాలు పూర్తిస్థాయిలో అందలేదని, వాటిని వెంటనే పంపిణీ చేయాలని ఆయన అన్నారు. మధ్యాహ్న భోజన పథకానికి సంబంధించి ఏజెన్సీలకు చెల్లించే రేట్లను సవరించి నాణ్యమైన భోజనం అందేలా చర్యలు తీసుకోవాలని, కంట్రిబ్యూటరీ పెన్షన్ విధానం (సీపీఎస్) రద్దు చేయాలని, విద్యారంగానికి బడ్జెట్‌లో 20 శాతం నిధులు కేటాయించా లని డిమాండ్ చేశారు. అలాగే కేజీబీవీ, మోడల్ స్కూల్ ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించి, ఏకీకృత సర్వీసుల అంశంపై స్పష్టత ఇవ్వడంతో పాటు పర్యవేక్షణ అధికారుల ఖాళీలను భర్తీ చేయాలని కోరారు. డీటీఎఫ్ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో భాగంగా కోనాపూర్, ఇనాయత్‌నగర్, అమీర్‌నగర్, కొనసముందర్, బషీరాబాద్, చౌట్‌పల్లి, హాసకొత్తూర్ తదితర గ్రామాల్లోని ప్రాథమిక, ఉన్నత పాఠశాలలను నాయకులు సందర్శించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి షేక్ మదర్, మండల కన్వీనర్ ఎం. ధర్మేందర్ తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article