29 C
Hyderabad
Monday, August 3, 2026

ఆహార, ఔషధాల కల్తీల నివారణకు కఠిన చట్టం తేవాలి

Must read

📰 Generate e-Paper Clip

 

. . . తెలంగాణ ప్రభుత్వం సమగ్ర బిల్లుకు కసరత్తు

 

. . . తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

 

హైదరాబాద్, బతుకమ్మ :

 

రాష్ట్రంలో ఆహార పదార్థాలు, ఔషధాల కల్తీని అరికట్టేందుకు కఠిన చట్టాన్ని రూపొందించాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని తెలంగాణ ఫుడ్ అడల్టరేషన్ అండ్ డ్రగ్ కంట్రోల్ యాక్ట్ (టీజీఎఫ్ఎడిసిఎ) రూపకల్పనపై ఎంసీహెచ్‌ఆర్‌డీ బోధి పెవిలియన్‌లో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ముఖ్యమంత్రి పలు కీలక ఆదేశాలు జారీ చేశారు. సమావేశంలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ, నిత్యావసర వస్తువులు, కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు, పాలు వంటి ఆహార పదార్థాల్లో పెరుగుతున్న కల్తీ కారణంగా ప్రజలు వివిధ అనారోగ్య సమస్యలకు గురవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఆకుకూరలు, కూరగాయలు, పాల ఉత్పత్తులు ఎక్కువకాలం నిల్వ ఉండేందుకు, పండ్లు త్వరగా మగ్గేందుకు విచ్చలవిడిగా రసాయనాలను వినియోగించడం ప్రజారోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతోందన్నారు. అలాగే, ఎరువులు, పురుగుమందుల అధిక వినియోగంతో వ్యవసాయ ఉత్పత్తుల్లో రసాయన అవశేషాలు అధికంగా బయటపడుతున్నాయని, ఈ కారణంగా కొన్ని దేశాలు భారత వ్యవసాయ ఉత్పత్తుల దిగుమతులను నిరాకరిస్తున్న విషయాన్ని కూడా ఆయన ప్రస్తావించారు. మార్కెట్‌లో సేంద్రియ ఉత్పత్తుల పేరుతో విక్రయిస్తున్న అనేక వస్తువుల ప్రామాణికతపై సందేహాలు ఉన్నాయని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. అధిక ధరలు చెల్లించి వినియోగదారులు కొనుగోలు చేస్తున్నప్పటికీ అవి నిజంగా సేంద్రియ ఉత్పత్తులేనా అనే విషయాన్ని నిర్ధారించే సమర్థవంతమైన వ్యవస్థ ప్రస్తుతం లేదన్నారు. కల్తీల నియంత్రణలో సమర్థవంతమైన చట్టాలు అమలు చేస్తున్న దేశాలను సందర్శించి అక్కడి విధానాలను అధ్యయనం చేయాలని అధికారులకు ముఖ్యమంత్రి సూచించారు. ఆ అధ్యయనాల ఆధారంగా సమగ్ర నివేదిక రూపొందించి, దాని ప్రకారం చట్టబిల్లును సిద్ధం చేసి శాసనసభలో విస్తృత చర్చకు తీసుకురావాలని ఆదేశించారు. శాసనసభ చర్చతో పాటు ప్రజల అభిప్రాయాలను కూడా స్వీకరించి తుది చట్టాన్ని రూపొందించాలని సూచించారు. కల్తీ ఘటనలపై సమాచార సేకరణను మరింత బలోపేతం చేసేందుకు విజిల్ బ్లోయర్ వ్యవస్థతో పాటు ప్రత్యేక టోల్ ఫ్రీ నంబర్‌ను ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. అలాగే, కల్తీల నిరోధానికి సంబంధించి ముందుగా క్యూర్ ప్రాంతాన్ని పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసి, అక్కడ నిబంధనలను అమలు చేసి వాటి అమలులో ఎదురయ్యే లోటుపాట్లను విశ్లేషించిన అనంతరం రాష్ట్రవ్యాప్తంగా విస్తరించాలని అధికారులకు సూచించారు. ఈ సమీక్ష సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు, డీజీపీ సీవీ ఆనంద్, ముఖ్యమంత్రి సలహాదారు, ఎక్స్ అఫీషియో స్పెషల్ చీఫ్ సెక్రటరీ కె. రామకృష్ణారావు, ముఖ్యమంత్రి ప్రిన్సిపల్ సెక్రటరీలు వి. శేషాద్రి, ఎన్. శ్రీధర్‌తో పాటు వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

 

A strict law must be enacted to prevent the adulteration of food and medicines.

More articles

Latest article