. . . ప్రజల ప్రాణాలతో చెలగాటం
. . . పట్టించుకోని అధికారులు
రుద్రూర్, బతుకమ్మ :
ప్రస్తుత కాలంలో వైద్యం ఖరీదైనది కావడంతో చిన్నా చితక సమస్యలు వస్తే పేద, మధ్య తరగతి ప్రజలు ప్రభుత్వ వైద్యశాలను ఆశ్రయిస్తుంటారు. వారిలో ఎక్కువ మంది వృద్ధులు, నిరక్షరాస్యులు ఉంటారు. అధికారుల పర్యవేక్షణ కొరవడడంతో వైద్యశాలలు సమస్యలకు నెలవుగా మారుతున్నాయి. మరీ ముఖ్యంగా సిబ్బంది తీరుతో చాలా మంది ఇబ్బందులు పడుతున్నారు. కాలం చెల్లిన మందులను సైతం పంపిణీ చేసి ప్రజల ఆరోగ్యంతో ఆటలాడుతున్నారు. ఇటీవలే రుద్రూర్ మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో రుద్రూర్ గ్రామానికి చెందిన ఓ గర్భిణీ స్త్రీకి కాలం చెల్లిన మందులను పంపిణీ చేశారని ఆమె కుటుంబీకులు తెలిపారు.

వారు తెలిపిన వివరాల ప్రకారం.. జూన్ ప్రతినెల ప్రభుత్వ ఆసుపత్రిలో గర్భిణీ స్త్రీలకు టెస్టులు నిర్వహిస్తారు. అయితే జూన్ 02 వ తేదీన గర్భిణీ స్త్రీకి క్యాల్షియం 60 టాబ్లెట్లు వ్రాసి ఇచ్చారని, అవి తీసుకొని 22 రోజులు అవుతుందన్నారు. అవి చూసేసరికి మే నెలలోనే డేట్ అయిపోయి ఉందన్నారు. ప్రస్తుతం ఆ గర్భిణీ స్త్రీ బాగానే ఉందన్నారు. ఈ విషయం పై గర్భిణీ స్త్రీ కుటుంబీకులు వైద్యాధికారిని అయోషా సిద్ధిఖాకు నిలదీయగా, కాలం చెల్లిన మందులను చూసుకోలేదని, ఎవరైతే ఫార్మసిస్టు మందులు ఇచ్చారో వారి పేర్లను పై అధికారుల దృష్టికి తీసుకెళ్లామని, మరోసారి ఇలా జరుగదన్నారు. ఇలా ప్రభుత్వ ఆసుపత్రిలో కాలం చెల్లిన మందులను పంపిణీ చేస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అదేవిధంగా ఓ వైద్యాధికారిణి హోదాలో ఉండి ఆసుపత్రికి వచ్చే రోగులకు సరిగ్గా చూడడం లేదన్నారు. ఇప్పటికైనా సంబంధిత శాఖ అధికారులు వెంటనే స్పందించి తగు చర్యలు తీసుకోవాలని కోరారు.

