28.8 C
Hyderabad
Monday, August 3, 2026

మాదిగల సామాజిక బహిష్కరణపై బాధితులకు చట్టప్రకారం న్యాయం జరుగాలి

Must read

📰 Generate e-Paper Clip

 

. . . అధికారులు సమన్వయంతో పని చేసి సమస్యకు శాశ్వత పరిష్కారం చేయాలి

 

. . . గన్నారంలో ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య విచారణ

 

ఇందల్వాయి, బతుకమ్మ :

 

ఇందల్వాయి మండలం గన్నారంలో మాదిగ సామాజిక వర్గానికి జరిగిన బహిష్కరణపై చట్టప్రకారం వారికి న్యాయం జరుగాలని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య అధికారులను ఆదేశించారు. గన్నారంలో జరిగిన సామాజిక బహిష్కరణపై వచ్చిన ఫిర్యాదులపై ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్యతో పాటు సభ్యులు బుధవారం గ్రామంలో పర్యటించారు. స్థానికంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో స్థానిక మాదిగ కులపెద్దల నుంచి వివరాలను అడిగి తెలుసుకున్నారు. గ్రామంలో మాదిగలకు దశాబ్ధాల క్రితం రెండు ఎకరాల వరకు భూమి ఇవ్వడంతో పట్టా కూడా ఇవ్వడం జరిగింది. ఆ భూమిలో బోర్ మోటారు వేసి మామిడి చెట్లను నాటి సాగు చేస్తున్నారు. అయితే గ్రామ అవసరాల కోసం సంబంధిత భూమిని కావాలని గ్రామాభివృద్ది కమిటీ మాదిగ సామాజిక వర్గంపై బహిష్కరణ వేటు వేసిందన్నారు. స్థానికంగా దళితులకు కేటాయించిన భూమిలో చెట్లను తొలగించి బోరులను కూల్చివేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంపై స్థానిక పోలీస్ స్టేషన్ లో వీడీసీ మొత్తం కమిటీపై ఫిర్యాదు చేస్తే కొందరిపైనే కేసులు నమోదు చేశారన్నారు. తాము పోలీసులకు, అధికార యంత్రాంగానికి ఫిర్యాదు చేశామన్న కక్షతో గ్రామంలో సామాజిక బహిష్కరణ వీడీసీ పిలుపునిచ్చిందని దాని ద్వారా తమకు ఉపాధి కరువైందని మాదిగలు ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామంలో చోటు చేసుకున్న ఆరోపణలు ఉన్న సామాజిక బహిష్కరణ అంశంపై వారు క్షేత్రస్థాయిలో పరిస్థితులను పరిశీలించి, సంబంధిత శాఖల అధికారులతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా బాధితులకు న్యాయం జరిగేలా చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులు సమన్వయంతో పనిచేసి సమస్యను త్వరితగతిన పరిష్కరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్  డిప్యూటీ కలెక్టర్ (యూటీ), ఏసీపీ, ఎస్సీ కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (ఈడి), జిల్లా గిరిజన అభివృద్ధి అధికారి (డిటిడిఓ) తో పాటు సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.

 

The victims of the social boycott of Madigas must receive justice in accordance with the law.

More articles

Latest article