. . . జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి సూచన
నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :
ఎస్ఐఆర్ ప్రక్రియలో భాగంగా ఓటర్ల నుండి ఎన్యూమరేషన్ ఫారంల స్వీకరణలో బూత్ లెవెల్ ఏజెంట్లు(బీఎల్ఏ) క్రియాశీలక పాత్ర పోషించాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి సూచించారు. ఇది కేవలం బూత్ లెవెల్ అధికారుల (బీఎల్ఓ) పని అని భావించకుండా, బీఎల్ఏ లు కూడా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని అన్నారు. నిజామాబాద్ నగరంలోని 6వ డివిజన్ పరిధిలో గల భూలక్ష్మి మాత ఆలయం కమ్యూనిటి హాల్ లో శనివారం సాయంత్రం నగర మేయర్ కే.ఉమారాణితో కలిసి కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆయా డివిజన్ల కార్పొరేటర్లు, బీ.ఎల్.ఓలు, బీ.ఎల్.ఏలు, సూపర్వైజర్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, నిజామాబాద్ జిల్లాలోని ఆర్మూర్, బాల్కొండ, బోధన్, నిజామాబాద్ రూరల్, బాన్సువాడ నియోజకవర్గాల పరిధిలో ఎస్.ఐ.ఆర్ ప్రక్రియ ఆశించిన రీతిలో వేగవంతంగా సాగుతోందని, అర్బన్ నియోజకవర్గంలో మాత్రం మందకొడిగా ఉందని పవర్ పాయింట్ ప్రొజెక్టర్ ద్వారా గణాంకాలతో సహా వివరించారు. అర్బన్ సెగ్మెంట్ లోనూ ఎస్.ఐ.ఆర్ ప్రక్రియ వేగవంతం అయ్యేందుకు బీ.ఎల్.ఏలు క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉంటూ, పూర్తిస్థాయిలో తోడ్పాటు అందించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని నొక్కి చెప్పారు. ముఖ్యంగా ప్రతి ఓటరు తప్పనిసరిగా ఎన్యూమరేషన్ ఫారంను బీ.ఎల్.ఓకు అందించేలా చూడాలన్నారు. బూత్ లెవెల్ ఏజెంట్లు ప్రతి రోజు 50 ఎన్యూమరేషన్ ఫారంలు ఓటర్ల నుండి స్వీకరించి బీ.ఎల్.ఓలకు అందజేయవచ్చని సూచించారు. గడువు ముగింపు సమయం వరకు వేచి చూడకుండా, ముందుగానే ఎన్యూమరేషన్ ఫారంలు అందించేలా ఓటర్లకు అవగాహన కలిపించాలని అన్నారు. లేని పక్షంలో ఓటర్ల వివరాలను డిజిటలైజేషన్ చేయడానికి, అబ్సెంట్, షిఫ్టేడ్, డెత్/డబుల్ (ఏ.ఎస్.డీ) జాబితా రూపొందించడానికి సమయం సరిపోక ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందన్నారు. దీనిని దృష్టిలో పెట్టుకుని ఓటర్లు వేగంగా తమ ఎన్యూమరేషన్ ఫారంలు అందించేలా బీ.ఎల్.ఏలు క్షేత్రస్థాయిలో తిరుగుతూ కృషి చేయాలని సూచించారు. ఓటర్లు తగిన వివరాలు తెలుసుకునేందుకు వీలుగా వారికి సహకారం అందించేలా నగరంలోని ప్రతి మున్సిపల్ సర్కిల్ పరిధిలో హెల్ప్ డెస్క్ లను కూడా ఏర్పాటు చేశామని అన్నారు. ఓటర్లు ఎన్నికల సంఘం వెబ్ సైట్ నుండి కూడా వివరాలు పొందవచ్చని సూచించారు. ఒకవేళ ఎవరికైనా గత ఎస్.ఐ.ఆర్ ఓటరు జాబితా వివరాలు తెలియకపోయినా సరే, వారు ఎన్యూమరేషన్ ఫారంపై కనీసం సంతకం చేసి గడువు తేదీ లోపు బీ.ఎల్.ఓలకు అందించాలన్నారు. అప్పుడే వారి పేరు ముసాయిదా ఓటరు జాబితాలో ఉంటుందని అన్నారు. ఒకవేళ ఎన్యూమరేషన్ ఫారం బీ.ఎల్.ఓలకు తిరిగి ఇవ్వకపోతే ఓటరు జాబితా నుండి పేరు గల్లంతు అవుతుందని కలెక్టర్ కరాఖండీగా తేల్చి చెప్పారు. ఎంతటి వారు అయినా, ఏ స్థాయిలో ఉన్నా సరే, ఎన్యూమరేషన్ ఫారం అందించాల్సిందేనని స్పష్టం చేశారు. ఎన్యూమరేషన్ ఫారంలో వివరాలు పొందుపర్చలేకపోయిన వారికి, తప్పుగా వివరాలు నమోదు చేసిన వారికి ముసాయిదా జాబితాను వెల్లడి చేసిన అనంతరం ఎన్నికల రిటర్నింగ్ అధికారి నోటీసు ఇచ్చి, హియరింగ్ కు పిలుస్తారని కలెక్టర్ తెలిపారు. అప్పుడు వారు తగిన ధృవీకరణ పత్రాలు చూపిస్తే ఓటరు జాబితాలో పేరు నమోదు చేస్తారని అన్నారు. కానీ అసలుకే ఎన్యూమరేషన్ ఫారం తిరిగి ఇవ్వకపోతే మాత్రం ముసాయిదా ఓటరు జాబితానే పేరు ఉండదని అన్నారు. దీనిని దృష్టిలో పెట్టుకుని ప్రతి ఓటరు, ప్రత్యేకించి నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గ ఓటర్లు అందరూ తప్పనిసరిగా ఎన్యూమరేషన్ ఫారంలను బీ.ఎల్.ఓలకు అందించాలని కలెక్టర్ సూచించారు. ఈ దిశగా బూత్ లెవెల్ ఏజెంట్లు ప్రత్యేక చొరవ చూపాలని, ఇప్పటివరకు కొంత జాప్యం జరిగి ఉండవచ్చని, ఇకనైనా అర్బన్ లో ఎన్యూమరేషన్ ఫారంల స్వీకరణ ప్రక్రియ వేగవంతం అయ్యేలా కృషి చేయాలని హితవు పలికారు. ఈ సందర్భంగా బీ.ఎల్.ఏల సందేహాలను కలెక్టర్ నివృత్తి చేశారు. ఈ సమావేశంలో నగర పాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్, కార్పొరేటర్లు స్రవంతి రెడ్డి, మల్లేష్ యాదవ్, వైష్ణవి, ఎన్నికల విభాగం పర్యవేక్షకుడు బాలరాజు, నిజామాబాద్ నార్త్ తహసీల్దార్ హరికిషోర్, బీ.ఎల్.ఓలు, బీ.ఎల్.ఏలు, సూపర్వైజర్లు, స్థానిక ఓటర్లు పాల్గొన్నారు.

