24.7 C
Hyderabad
Monday, August 3, 2026

రాష్ట్ర బడ్జెట్ లక్ష్యాల సాధనకు ఆదాయ సమీకరణపై ప్రత్యేక దృష్టి

Must read

📰 Generate e-Paper Clip

 

. . . తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలు

 

హైదరాబాద్, బతుకమ్మ :

 

రాష్ట్ర బడ్జెట్ లక్ష్యాలను సాధించేందుకు ఆదాయ సమీకరణపై కఠినంగా దృష్టి సారించాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదాయ పరిస్థితిపై ఎంసీఆర్ హెచ్‌ఆర్డీలో జరిగిన ఉన్నతస్థాయి సమీక్ష సమావేశంలో ముఖ్యమంత్రి కీలక సూచనలు చేశారు. ఈ సమావేశంలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు, ప్రభుత్వ సలహాదారు కె. రామకృష్ణారావు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ఆదాయ వృద్ధికి సంబంధించి పలు కీలక ఆదేశాలు జారీ చేశారు. ఆదాయ సమీకరణలో భాగంగా హెచ్‌ఎండీఏ, టీజీఐఐసీ వంటి సంస్థలు ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. వాణిజ్య పన్నులు, ఎక్సైజ్, మైనింగ్ తదితర రంగాల్లో ఆదాయ లీకేజీలను పూర్తిగా అరికట్టాలని అధికారులను ఆదేశించారు. ఆదాయ సమీకరణ ప్రక్రియను నిరంతరం పర్యవేక్షించేందుకు ప్రత్యేకంగా ‘చేజింగ్ సెల్’ ఏర్పాటు చేయాలని సూచించారు. ఆదాయం పెంపు, నిధుల సమీకరణ విషయంలో నిర్లక్ష్యానికి తావు ఉండకూడదని స్పష్టం చేశారు. ప్రభుత్వ శాఖల పనితీరు మరింత మెరుగుపడాల్సిన అవసరం ఉందని సీఎం పేర్కొన్నారు. పెండింగ్ ప్రాజెక్టులు, ఇతర పనుల పూర్తికి అనుగుణంగా శాఖలు తమ బడ్జెట్ ప్రతిపాదనలు సిద్ధం చేసుకోవాలని సూచించారు. ప్రాజెక్టుల అమలులో భూసేకరణకు తొలి ప్రాధాన్యత ఇవ్వాలని ఆదేశించారు. ప్రభుత్వం ప్రతిపాదించిన బడ్జెట్ వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా ఉండాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ఊహాజనిత అంచనాలతో కాకుండా వాస్తవ ఆదాయ వనరులు, అవసరాల ఆధారంగా బడ్జెట్ రూపకల్పన జరగాలని పేర్కొన్నారు. లక్ష్యాలను చేరుకునేందుకు అన్ని శాఖలకు అవసరమైన సహకారం అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని సీఎం తెలిపారు.

 

Special focus on revenue mobilization to achieve state budget targets.

More articles

Latest article