. . . పెండింగ్ బిల్లులు వెంటనే చెల్లించాలి
. . . వామపక్ష పార్టీల ధర్నా
నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :
అర్హులైన నిరుపేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేయడంతో పాటు పెండింగ్‌లో ఉన్న ఇందిరమ్మ బిల్లులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ బుధవారం వామపక్ష పార్టీలు జిల్లా కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించాయి. రాష్ట్రవ్యాప్త ఆందోళనల్లో భాగంగా సీపీఐ, సీపీఎం, సీపీఐ(ఎంఎల్) మాస్ లైన్, న్యూడెమోక్రసీ, ఆర్‌ఎస్‌పీ పార్టీల ఆధ్వర్యంలో జరిగిన ఈ నిరసన అనంతరం అడిషనల్ కలెక్టర్ భుజంగరావుకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా సీపీఐ జిల్లా కార్యదర్శి పి. సుధాకర్, సీపీఐ(ఎంఎల్) మాస్ లైన్ నగర కార్యదర్శి ఎం. సుధాకర్, సీపీఎం జిల్లా కార్యదర్శి ఏ. రమేష్ బాబు, న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి వరదయ్య, ఆర్‌ఎస్‌పీ జిల్లా కార్యదర్శి రాములు మాట్లాడుతూ ఎన్నికల సమయంలో నిరుపేదలకు పక్కా ఇళ్లు నిర్మించి గుడిసెలు లేని రాష్ట్రంగా తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం వాటిని అమలు చేయడంలో విఫలమైందని విమర్శించారు. ఇందిరమ్మ ఇళ్ల బిల్లులు పెండింగ్‌లో ఉండటంతో నిర్మాణ పనులు నత్తనడకన సాగుతున్నాయని వారు ఆందోళన వ్యక్తం చేశారు. ఇండ్ల స్థలాలు లేని పేదలకు ఇళ్లు నిర్మించి ఇస్తామని ప్రభుత్వాలు ప్రకటిస్తున్నప్పటికీ ఆచరణలో మాత్రం అమలు కావడం లేదని పేర్కొన్నారు. కార్పొరేట్ సంస్థలకు వేలాది ఎకరాల భూములను కేటాయిస్తున్న ప్రభుత్వాలు, పేదల విషయంలో మాత్రం నిర్లక్ష్య వైఖరి అవలంబిస్తున్నాయని ఆరోపించారు.

ప్రభుత్వ ఖాళీ భూముల్లో ఎన్నో ఏళ్లుగా నివసిస్తున్న పేదలకు వెంటనే ఇళ్ల పట్టాలు ఇవ్వాలని, నిర్మాణం పూర్తయిన డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లను అర్హులైన లబ్ధిదారులకు కేటాయించాలని డిమాండ్ చేశారు. అలాగే అర్హులైన ప్రతి నిరుపేద కుటుంబానికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన రూ.5 లక్షల ఆర్థిక సహాయానికి కేంద్ర ప్రభుత్వం నుంచి మరో రూ.5 లక్షలు జోడించి మొత్తం రూ.10 లక్షల ఆర్థిక సాయం అందించేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పెండింగ్‌లో ఉన్న ఇందిరమ్మ బిల్లులను వెంటనే విడుదల చేసి నిర్మాణ పనులు వేగవంతం చేయాలని కోరారు. గత ప్రభుత్వం మాదిరిగానే ప్రస్తుత ప్రభుత్వం కూడా పేదలను నిరాశపరిస్తే సహించబోమని హెచ్చరించిన వామపక్ష నేతలు, అర్హులైన ప్రతి కుటుంబానికి గృహ వసతి కల్పించేలా ప్రభుత్వం స్పష్టమైన కార్యాచరణ రూపొందించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో అన్ని వామపక్ష పార్టీలు సంయుక్త కార్యాచరణ చేపట్టి పేదలను సమీకరించి ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వామపక్ష పార్టీల నాయకులు ఓమయ్య, రఘురాం, లింగం, విటల్, పెద్ది వెంకటరాములు, సుజాత, శివరాజ్, గంగారెడ్డి, అనిల్, నరేష్, అమూల్య, రఫీక్, సాయిలు, కిరణ్, సృజన్, గంగాధర్, లక్ష్మీ, నారాయణతో పాటు కార్యకర్తలు, ఇళ్ల స్థలాల బాధితులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

