. . . సీఐటీయూ డిమాండ్
నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :
అంగన్వాడీ ఉద్యోగులకు బీఎల్ఓ విధుల నుంచి మినహాయింపు కల్పించాలని సీఐటీయూ నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు ఈరోజు సీఐటీయూ కార్యాలయంలో తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా విస్తృత సమావేశం నిర్వహించారు. సమావేశంలో అంగన్వాడీ ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించి, వాటి పరిష్కారం కోసం ఐసీడీఎస్ ప్రాజెక్టు అధికారితో చర్చలు జరిపారు. అంగన్వాడీ కేంద్రాలు ప్రారంభమైన నేపథ్యంలో చిన్నారులు, గర్భిణీలు, బాలింతలకు పౌష్టికాహారం అందించడంతో పాటు ఈసీఈ (ప్రారంభ బాల్య విద్య) కార్యక్రమాలను నిర్వహించాల్సి ఉన్నప్పటికీ, అదనంగా బీఎల్ఓ విధులు అప్పగించడం వల్ల కేంద్రాల నిర్వహణ దెబ్బతింటోందని నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. అనేక కేంద్రాల్లో ఆయాలు లేకపోవడం పరిస్థితిని మరింత క్లిష్టతరం చేస్తోందన్నారు. ఈ విషయాన్ని జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి తగిన చర్యలు చేపట్టాలని కోరినట్లు తెలిపారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు, యూనియన్ జిల్లా గౌరవ అధ్యక్షుడు ఎ. రమేష్ బాబు మాట్లాడుతూ గత నెల రోజులుగా అంగన్వాడీ ఉద్యోగులు తీవ్ర మానసిక ఒత్తిడికి గురవుతున్నారని అన్నారు. వారికి వేసవి సెలవులు కూడా వర్తింపజేయలేదని, ప్రస్తుతం పాఠశాలలు ప్రారంభమైన తర్వాత బీఎల్ఓ విధులు అప్పగించడం వల్ల కేంద్రాల్లో టీచర్లు అందుబాటులో ఉండలేకపోతున్నారని చెప్పారు. చిన్నారులు, గర్భిణీలు, బాలింతలకు సకాలంలో పౌష్టికాహారం అందించడంతో పాటు పిల్లలకు విద్యాబోధన చేయాల్సిన బాధ్యత అంగన్వాడీ టీచర్లపై ఉందన్నారు. అదనంగా ప్రతిరోజూ లబ్ధిదారుల ఫోటోలు తీసి ఆన్‌లైన్‌లో నివేదికలు పంపాలని అధికారులు ఒత్తిడి చేస్తున్నారని ఆరోపించారు. ఇటీవల పల్స్ పోలియో కార్యక్రమ బాధ్యతలను కూడా అంగన్వాడీలకే అప్పగించారని పేర్కొన్నారు. ఒకే సమయంలో మూడు రకాల బాధ్యతలను నిర్వర్తించడం సాధ్యం కాదని, ఏ పని సక్రమంగా చేయలేకపోయినా ఉద్యోగులపై వేధింపులు జరుగుతున్నాయని విమర్శించారు. ఈ పరిస్థితి కొనసాగితే అంగన్వాడీ కేంద్రాల నిర్వహణ దెబ్బతిని, చిన్నారుల హాజరు తగ్గే ప్రమాదం ఉందని హెచ్చరించారు. అందువల్ల అంగన్వాడీ ఉద్యోగులను బీఎల్ఓ విధుల నుంచి వెంటనే మినహాయించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో యూనియన్ జిల్లా అధ్యక్షురాలు దేవగంగు, జిల్లా ప్రధాన కార్యదర్శి పి. స్వర్ణ, జిల్లా కోశాధికారి చంద్రకళ, జిల్లా నాయకులు సూర్యకళ, వాణి, గోదావరి, యమునా, లలిత, సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు జంగం గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.

