. . . గ్లోబల్ క్లైమేట్ సదస్సులో అవకాశం
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ :
అంతర్జాతీయ వేదికపై నిజామాబాద్‌కు చెందిన న్యాయవాది, సామాజిక కార్యకర్త మహ్మద్ జునైద్ అలీకి అరుదైన అవకాశం లభించింది. థాయ్‌లాండ్ రాజధాని బ్యాంకాక్‌లో ఈ నెల 29, 30 తేదీల్లో జరగనున్న 7వ గ్లోబల్ కాన్ఫరెన్స్ ఆన్ క్లైమేట్ అండ్ ఎస్డీజీ సినర్జీస్ సదస్సులో ఆయన భారత్ తరపున ప్రాతినిధ్యం వహించనున్నారు. ఐక్యరాజ్యసమితి ఆర్థిక, సామాజిక కమిషన్ ఫర్ ఆసియా అండ్ పసిఫిక్ (యూఎన్ ఈఎస్సీఏపీ), డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఎకనామిక్ అండ్ సోషల్ అఫైర్స్ (డీఈఎస్ఏ) సహకారంతో నిర్వహిస్తున్న ఈ ప్రతిష్టాత్మక సదస్సులో ప్రపంచవ్యాప్తంగా వాతావరణ మార్పులు, సుస్థిర అభివృద్ధి లక్ష్యాల (ఎస్డీజీలు) సాధనపై నిపుణులు చర్చించనున్నారు. ఈ సందర్భంగా మహ్మద్ జునైద్ అలీ వాతావరణ మార్పుల ప్రభావాలు, సుస్థిర అభివృద్ధి కోసం అవసరమైన వ్యూహాలు, సామాజిక భాగస్వామ్యం వంటి అంశాలపై తన అనుభవాలను, అభిప్రాయాలను పంచుకోనున్నారు. ప్రపంచ దేశాలు ఎదుర్కొంటున్న పర్యావరణ సవాళ్లకు పరిష్కార మార్గాలను అన్వేషించడంలో ఈ సదస్సు కీలకంగా నిలవనుంది. మహ్మద్ జునైద్ అలీ గతంలో పలు సామాజిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనడంతో పాటు న్యాయ రంగంలోనూ సేవలందిస్తూ ప్రత్యేక గుర్తింపు పొందారు. అంతర్జాతీయ స్థాయి సదస్సుకు ఆయన ఎంపిక కావడం నిజామాబాద్‌కు గర్వకారణమని పలువురు నాయకులు, సామాజిక కార్యకర్తలు, న్యాయవాద సంఘాల సభ్యులు అభినందించారు. యువతకు ఆయన ప్రయాణం స్ఫూర్తిదాయకమని, భవిష్యత్‌లో మరిన్ని సామాజిక మార్పులకు దోహదపడుతుందని వారు పేర్కొన్నారు.

