. . . ఇప్పటివరకు 30 మంది అరెస్ట్
వెబ్ డెస్క్, బతుకమ్మ :
దేశవ్యాప్తంగా నిర్వహించిన నీట్ ప్రవేశ పరీక్షల్లో ఫేక్ అభ్యర్థుల వ్యవహారం సంచలనంగా మారింది. ఇప్పటివరకు 30 మంది నకిలీ అభ్యర్థులను పోలీసులు గుర్తించి అరెస్ట్ చేయగా, మరింత మంది కోసం దర్యాప్తు కొనసాగుతోంది. బీహార్‌లోని లక్కీసరాయ్ జిల్లాలో ఉన్న ఒక పరీక్షా కేంద్రంలోనే పదిమంది అభ్యర్థులు ఇతరుల తరఫున పరీక్షలు రాసినట్లు విచారణలో బయటపడింది. ఈ ఘటనతో అధికారులు అప్రమత్తమై, ఇతర పరీక్షా కేంద్రాల్లో కూడా అభ్యర్థుల గుర్తింపుపై విస్తృత స్థాయిలో దర్యాప్తు చేపట్టారు. ఇక పరీక్షల నిర్వహణలో అధికారులు అత్యంత కట్టుదిట్టమైన భద్రతా చర్యలు అమలు చేసిన సంగతి తెలిసిందే. పరీక్షా కేంద్రాల్లోకి అభ్యర్థులను అనుమతించే ముందు కఠిన తనిఖీలు నిర్వహించారు. మహిళల మంగళసూత్రాలు, ముక్కుపుడకలు, గాజులు, చేతికి కట్టుకున్న దారాలు కూడా తొలగించాల్సి వచ్చింది. ముస్లిం మహిళలకు స్కార్ఫ్ లు, బురఖాలు కూడా అనుమతించలేదు. చివరకు చెప్పులు కూడా బయట వదిలేసి పరీక్షా హాలులోకి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే ఇంత కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసినప్పటికీ, అసలు అభ్యర్థుల స్థానంలో నకిలీ అభ్యర్థులు పరీక్షా కేంద్రాల్లోకి ఎలా ప్రవేశించగలిగారన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ప్రవేశ ద్వారాల వద్ద గుర్తింపు ప్రక్రియలో లోపాలు ఉన్నాయా అనే విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. ప్రశ్నపత్రాల భద్రత కోసం విమానాల ద్వారా రవాణా చేయడం, ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు చేయడం వంటి చర్యలు తీసుకున్నప్పటికీ, పరీక్ష రాసిన అభ్యర్థులలో ఎంతమంది నకిలీలు ఉన్నారనే అంశం ఇప్పుడు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తోంది. ఈ వ్యవహారంపై అధికారులు సమగ్ర విచారణ చేపట్టగా, మరిన్ని వివరాలు త్వరలో వెల్లడయ్యే అవకాశం ఉంది.
