29.4 C
Hyderabad
Sunday, August 2, 2026

కార్మికులకు రూ.26 వేల కనీస వేతనం అమలు చేయాలి

Must read

📰 Generate e-Paper Clip

 

. . . ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి వై. ఓమయ్య డిమాండ్

 

కామారెడ్డి, బతుకమ్మ :

 

కార్మికుల సమస్యల పరిష్కారానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే చర్యలు తీసుకోవాలని ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి వై. ఓమయ్య డిమాండ్ చేశారు. కామారెడ్డి జిల్లా ఏఐటీయూసీ కార్యాలయంలో జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన విస్తృతస్థాయి కార్మిక సంఘాల సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సమావేశానికి ఏఐటీయూసీ జిల్లా నాయకులు పి. బాలరాజు అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా వై. ఓమయ్య మాట్లాడుతూ కార్మికులకు నష్టం కలిగించే నాలుగు లేబర్ కోడ్‌లను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. పని గంటలు పెంచుతూ కనీస వేతనాలు అమలు చేయకపోవడం వల్ల కార్మికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం కార్మికులకు కనీసం రూ.26 వేల వేతనం చెల్లించాలని ఆయన కోరారు. కార్మికులకు న్యాయమైన వేతనాలతో పాటు సంక్షేమ హక్కులు, ఆరోగ్య భద్రత, ఉద్యోగ భద్రత కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వాలదేనని తెలిపారు. 56 సంవత్సరాలు నిండిన కార్మికులకు పెన్షన్ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం కనీస వేతనాలు పెంచామని చెప్పుకుంటున్నప్పటికీ వాస్తవ పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయని విమర్శించారు. కార్మిక సంక్షేమ బోర్డుల ద్వారా కార్మికులకు రక్షణ కల్పించాలని, అసంఘటిత రంగ కార్మికులకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రభుత్వ ఆసుపత్రి కార్మికులు, మున్సిపల్ కార్మికులు, సివిల్ సప్లై హమాలీలు, బీడీ కార్మికులు, మధ్యాహ్న భోజన కార్మికులు తదితర రంగాల్లో పనిచేస్తున్న వారికి సరైన వేతనాలు, ఉద్యోగ భద్రత కల్పించడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. బీడీ రంగంలో జిల్లాలో లక్షలాది మంది కార్మికులు పనిచేస్తున్నప్పటికీ వారికి తగిన వేతనాలు అందడం లేదన్నారు. నాణ్యమైన ఆకుకు తగిన వేతనం ఇవ్వాలని, కొన్ని బీడీ కంపెనీలు కార్మికులను దోపిడీ చేస్తున్నాయని ఆరోపించారు. 1000 బీడీలకు చెల్లించాల్సిన వేతనాలు కూడా సక్రమంగా ఇవ్వడం లేదని అన్నారు. మున్సిపల్, ఆసుపత్రి కార్మికులపై పని భారం పెరుగుతున్నప్పటికీ కనీస వేతనాలు అమలు కావడం లేదని పేర్కొన్నారు. పెరుగుతున్న నిత్యావసర ధరలకు అనుగుణంగా కార్మికుల వేతనాలు పెంచాలని డిమాండ్ చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే స్పందించి కార్మికులకు రూ.26 వేల కనీస వేతనాన్ని కచ్చితంగా అమలు చేయాలని, లేనిపక్షంలో భవిష్యత్‌లో జరిగే ఆందోళనలకు ప్రభుత్వాలే బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఈ సమావేశంలో కామారెడ్డి జిల్లా సీపీఐ కార్యదర్శి ఎల్. దశరథ్, ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు పి. బాలరాజు, కార్యదర్శి గొర్రె బాలరాజు, మున్సిపల్ కార్మిక సంఘ నాయకులు ఎం. లక్ష్మణ్ రాజు, ఆర్. లక్ష్మణ్ రాజేందర్, సివిల్ సప్లై సంఘ నాయకులు బాజీ సాయిలు, కృష్ణ, ఆసుపత్రి కార్మికులు ఎండి రఫిక్, శ్రీనివాస్, సలీం, తెలంగాణ బీడీ వర్కర్స్ యూనియన్ నాయకులు అనుముల గంగాధర్, కుంచె శ్రీనివాస్, రాజేష్, సిద్ధి రాములు, రాజేందర్, దేవరాజ్, సాయిలు తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article