28.8 C
Hyderabad
Monday, August 3, 2026

కనీస వేతనాల ప్రకటనపై ప్రభుత్వం స్పష్టతనివ్వాలి

Must read

📰 Generate e-Paper Clip

 

. . . టీయుసీఐ రాష్ట్ర అధ్యక్షుడు కే.సూర్యం

 

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :

 

రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన కనీస వేతనాల పెంపు విషయంలో స్పష్టత, సమగ్రత లేకపోవడంతో కార్మికుల్లో గందరగోళం నెలకొంటోందని ట్రేడ్ యూనియన్ సెంటర్ ఆఫ్ ఇండియా (టీయుసీఐ) రాష్ట్ర అధ్యక్షుడు కే. సూర్యం విమర్శించారు. టీయుసీఐ జిల్లా కమిటీ సమావేశం శనివారం జిల్లా కేంద్రంలోని కోటగల్లిలోని శ్రామిక భవన్‌లో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోటి 11 లక్షల మంది కార్మికులకు వేతనాలు పెంచుతున్నట్లు ప్రకటించినప్పటికీ, ఆ ప్రకటనలో అనేక అంశాలపై స్పష్టత లేదన్నారు. రాష్ట్రాన్ని మూడు జోన్లుగా విభజించి వేతనాలు నిర్ణయించడం అశాస్త్రీయమని, అసమంజసమని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో 73 షెడ్యూల్డ్ ఎంప్లాయిమెంట్లు ఉన్నాయని, వాటిలో ఐదు జీవోల్లో 2021 లోనే బేసిక్ వేతనాన్ని రూ.18 వేలుగా నిర్ణయించారని గుర్తుచేశారు. ప్రస్తుతం బేసిక్ వేతనాన్ని పెంచకుండా, వేరియబుల్ డియర్‌నెస్ అలవెన్స్ (వీడీఏ)కు సంబంధించిన ప్రకటన లేకుండానే వేతనాల పెంపును ప్రకటించడం కార్మికులను తప్పుదారి పట్టించడమేనని విమర్శించారు. కార్మిక సంఘాలు సుదీర్ఘకాలంగా కనీస వేతనాన్ని రూ.26 వేలుగా నిర్ణయించాలని డిమాండ్ చేస్తున్నాయని, ఆ మేరకు వేతన సవరణ చేపట్టాలని టీయుసీఐ కోరుతున్నదన్నారు. డాక్టర్ ఆక్రాయిడ్ సూత్రం ఆధారంగా వేతనాలను పునర్నిర్ణయించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలోని మిగతా షెడ్యూల్డ్ ఎంప్లాయిమెంట్లకు సంబంధించిన జీవోల పరిస్థితి ఏమిటనే విషయాన్ని ప్రభుత్వం వెల్లడించలేదని అన్నారు. అలాగే 2021లో నిర్ణయించిన రూ.18 వేల బేసిక్ వేతనాన్ని ప్రస్తుత ప్రభుత్వం పక్కనపెట్టిందని ఆరోపించారు. ముఖ్యమంత్రి ప్రకటించిన వేతనాల పెంపు ఏయే రంగాల కార్మికులకు వర్తిస్తుందో కూడా స్పష్టత ఇవ్వలేదని ఆయన పేర్కొన్నారు. అన్ని ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న కార్మికులందరికీ కనీస వేతనాలను అమలు చేయాలని, లేనిపక్షంలో ఆందోళనలను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ సమావేశంలో టీయుసీఐ జాతీయ ఉపాధ్యక్షుడు వనమాల కృష్ణ, జిల్లా అధ్యక్షుడు ఎం. నరేందర్, జిల్లా కార్యదర్శి ఎం. సుధాకర్, జిల్లా ఉపాధ్యక్షులు ఎం. వెంకన్న, డి. రాజేశ్వర్, సహాయ కార్యదర్శి బి. మల్లేష్‌తో పాటు నాయకులు సాయరెడ్డి, లక్ష్మణ్, లింగం, రాజేశ్వర్, రెహనా, గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article