28.7 C
Hyderabad
Saturday, August 1, 2026

ఏసిబి వలలో మరో అవినీతి చేప

Must read

📰 Generate e-Paper Clip

 

. . . లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డ డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ అధికారి

 

నల్గొండ, బతుకమ్మ :

 

నల్గొండ జిల్లా రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ (ఆర్డీవో) కార్యాలయంలో పనిచేస్తున్న డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ అధికారి ఏసీబీ వలలో చిక్కారు. ఏసీబీ విడుదల చేసిన ప్రకటన ప్రకారం, నల్గొండ రేంజ్ ఏసీబీ అధికారులు శుక్రవారం డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ జి. పవన్ కుమార్‌ను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఫిర్యాదుదారుడి తల్లి, అత్తకు సంబంధించిన భూముల సర్వే రిపోర్ట్ జారీ చేసేందుకు అధికారి రూ.35,000 లంచం డిమాండ్ చేసినట్లు ఏసీబీ తెలిపింది. ఈ మొత్తంలో భాగంగా రూ.15,000 స్వీకరిస్తుండగా నల్గొండ కలెక్టరేట్ సమీపంలో ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. అంతకుముందే రూ.20,000 అడ్వాన్స్ లంచంగా తీసుకున్నట్లు విచారణలో తేలింది. అధికారి వద్ద నుంచి రూ.15,000 లంచం సొమ్మును ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అధికార విధులను సక్రమంగా నిర్వహించకుండా, అక్రమ ప్రయోజనం పొందేందుకు ప్రయత్నించినట్లు ఏసీబీ పేర్కొంది. నిందితుడిని అరెస్ట్ చేసి, నాంపల్లి ప్రత్యేక ఏసీబీ కోర్టులోని గౌరవ I అదనపు ప్రత్యేక న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచి రిమాండ్‌కు తరలించనున్నట్లు ఏసీబీ వెల్లడించింది. కేసు దర్యాప్తు కొనసాగుతోంది. ఏ ప్రభుత్వ ఉద్యోగి అయినా లంచం డిమాండ్ చేస్తే ప్రజలు ఏసీబీ టోల్ ఫ్రీ నంబర్ 1064 కు సమాచారం ఇవ్వాలని అధికారులు కోరారు. ప్రభుత్వ కార్యాలయాలు, ముఖ్యమైన ప్రదేశాల్లో ఏర్పాటు చేసిన ఏసీబీ క్యూఆర్ కోడ్ ద్వారా కూడా ఫిర్యాదులు చేయవచ్చని, ఫిర్యాదుదారుల పేర్లు, వివరాలను గోప్యంగా ఉంచుతామని ఏసీబీ స్పష్టం చేసింది.

More articles

Latest article